Mandakrsihna Madiga Files Complaint: పోలీసుల చిత్రహింసల వల్లే కర్ల రాజేశ్ మృతి
ABN , Publish Date - Dec 17 , 2025 | 06:03 AM
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ వాసి అయిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన కర్ల రాజేశ్‌ను పోలీసులు చట్టవిరుద్ధంగా కస్టడీలోకి తీసుకుని చిత్రహింసలు పెట్టారు....
డీజీపీకి ఫిర్యాదు చేసిన మందకృష్ణ మాదిగ
హైదరాబాద్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ‘‘సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ వాసి అయిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన కర్ల రాజేశ్‌ను పోలీసులు చట్టవిరుద్ధంగా కస్టడీలోకి తీసుకుని చిత్రహింసలు పెట్టారు. రమేశ్ చావుకు కారణమైన చిలుకూరు ఎస్సై, కోదాడ రూరల్ సీఐలపై చర్యలు తీసుకోవాలి’’ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్ధాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన రాజేశ్ తల్లి లలితమ్మతో కలిసి డీజీపీ శివధర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. రాజేశ్‌ను అక్రమంగా నిర్బంధించారని పేర్కొంటూ అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను అందజేశారు. సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల గోల్‌మాల్ కేసులో రాజేశ్‌ను నవంబరు 9న పట్టుకున్నామని చిలుకూరు పోలీసులు చెబుతుంటే, నవంబరు 4వ తేదీ నుంచే పోలీసు స్టేషన్ లాక్‌పలో రాజేశ్‌ను ఎందుకు ఉంచారని, కేసు నమోదు కావడానికి ఐదు రోజుల ముందే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఎందుకు నిర్బంధించారని మందకృష్ణ ప్రశ్నించారు. రాజేశ్ మరణానికి కారకులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని, రాజేశ్ మృత దేహనికి రీ పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు.