Man mistakenly shifted to mortuary: బతికున్న వ్యక్తి మార్చురీకి తరలింపు!
ABN , Publish Date - Oct 31 , 2025 | 02:43 AM
వైద్యం కోసం వచ్చిన ఓ రోగికి ఆధార్‌కార్డు లేదనే కారణంతో.. సిబ్బంది ఆస్పత్రిలో చేర్చుకోలేదు. అంతటితో ఆగకుండా..
మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో అమానవీయ ఘటన
పోలీసుల జోక్యంతో ఎమర్జెన్సీ వార్డుకు తరలింపు
నెహ్రూసెంటర్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): వైద్యం కోసం వచ్చిన ఓ రోగికి ఆధార్‌కార్డు లేదనే కారణంతో.. సిబ్బంది ఆస్పత్రిలో చేర్చుకోలేదు. అంతటితో ఆగకుండా.. ఆ రోగి అనారోగ్యంతో ఆస్పత్రి ఆవరణలోనే అచేతనంగా పడిపోతే.. చనిపోయాడని పొరపడి మార్చురీకి తరలించిన ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం, మానవత్వాన్ని మంటగలిపేలా చేసింది. మరుసటి రోజు మార్చురీకి వచ్చిన స్వీపర్లు రోగి కదలికల్ని గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో గురువారం విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అమానవీయ ఘటన మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. బాధితుడు, ఆస్పత్రి సిబ్బంది కథనం ప్రకా రం, మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారానికి చెందిన ఎల్ది రాజు నడుం, మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ వారం రోజుల కిందట వైద్యం కోసం మానుకోట జిల్లా ఆస్పత్రికి వచ్చాడు. అతని వద్ద ఆధార్ కార్డు లేకపోవడంతో ఆస్పత్రిలో చేర్చుకోవడానికి సిబ్బంది నిరాకరించారు. దీంతో రెండు రోజుల పాటు ఆస్పత్రి క్యాంటిన్ ఆవరణలోనే పడికాపులు కాశాడు. సరైన వైద్య సదుపాయం, ఆహారం లేక నీరసించిపోయాడు. దీంతో అచేతన స్థితిలో ఉన్న రాజును చనిపోయాడని భావించిన సిబ్బంది మార్చురీలో భద్రపరిచేందుకు తీసుకువెళ్లారు. అక్కడ బాక్సులు ఖాళీ లేకపోవడంతో అతడిని మార్చురీ ప్రాంగణంలోని గేట్ వద్ద ఉంచారు. కాగా, మరుసటి రోజు ఉదయం మార్చురీ శుభ్రపరచడానికి వచ్చిన స్వీపర్లు.. రాజులో కదలికలు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు.
రాజుకు చికిత్స అందిస్తున్నాం
’’బతికున్న వ్యక్తిని మార్చురీలో పెట్టారంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు. ఆస్పత్రి సమీపంలో రోడ్డుపై వర్షంలో నడవలేని స్థితిలో ఉన్న యాచకుడిని సెక్యూరిటీ సిబ్బంది మానవత్వంతో ఆస్పత్రిలో చేర్పించారు. మార్చురీ సిబ్బంది దగ్గరలో ఉన్న బెంచీపైకి చేర్చి అక్కడి నుంచి వార్డుకు మార్చారు. దానిని కొంతమంది వక్రీకరించి జిల్లా ఆస్పత్రిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ కుట్రల్లో భాగంగా.. ఆస్పత్రిపై విషం చిమ్మవద్దు’’
- జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు