Insurance Fraud: అన్నను టిప్పర్‌తో తొక్కించి హత్య
ABN , Publish Date - Dec 03 , 2025 | 03:40 AM
వ్యాపారాల్లో నష్టాలు, షేర్ మార్కెట్‌లో డబ్బులు పోగొట్టుకున్న ఓ యువకుడు అప్పుల నుంచి సులువుగా గట్టెక్కెడం ఎలా అని అక్రమ మార్గాలను అన్వేషించాడు....
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తమ్ముడి దారుణం
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఘటన ముందస్తు కుట్రలో భాగంగా అన్న పేరున 4.14 కోట్ల పాలసీలు
కరీంనగర్ క్రైం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): వ్యాపారాల్లో నష్టాలు, షేర్ మార్కెట్‌లో డబ్బులు పోగొట్టుకున్న ఓ యువకుడు అప్పుల నుంచి సులువుగా గట్టెక్కెడం ఎలా అని అక్రమ మార్గాలను అన్వేషించాడు. ఈ క్రమంలో అతడి మదిలో ఓ కుటిల ఆలోచన మెదిలింది. సొంత అన్ననే కడతేర్చితే రూ.కోటిన్నర అప్పుల నుంచి బయటపడొచ్చని పథకం వేశాడు. అనుకున్నదే తడవుగా అన్న పేరున బీమా పాలసీలు చేయించాడు. ఆపై అతడిని టిప్పర్‌తో తొక్కించి దారుణంగా చంపేశాడు. కేసు వివరాలను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మంగళవారం మీడియాకు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన మామిడి నరేశ్ షేర్ మార్కెట్‌లో రూ.25 లక్షల పెట్టుబడి పెట్టాడు. రెండు టిప్పర్లు కొనుగోలు చేశాడు. పలు వ్యాపారాలు చేసి నష్టపోవడంతో రూ.1.5 కోట్ల అప్పులయ్యాయి. టిప్పర్ల ఈఎంఐ చెల్లించడం కష్టంగా మారింది. దీంతో అతడు ఓ పథకం వేశాడు. ప్రణాళిక ప్రకారం తన అన్న మామిడి వెంకటేశ్(37) పేరుపై రూ.4.14 కోట్ల విలువైన తొమ్మిది బీమా పాలసీలు చేశాడు. వెంకటేశ్ మానసిక పరిస్థితి సరిగా ఉండదు. అతడికి వివాహం కాలేదు. బీమా పాలసీలు చేసిన తర్వాత నరేశ్.. తన స్నేహితుడు నముండ్ల రాకేశ్, టిప్పర్ డ్రైవర్ మునిగాల ప్రదీ్‌పలతో వెంకటేశ్‌ను హత్య చేయాలని ఒప్పందం చేసుకున్నాడు. నవంబరు 29న రాత్రి నరేశ్ తన టిప్పర్‌లో మట్టి నింపుకుని రావాలని డ్రైవర్ ప్రదీ్‌పకు చెప్పాడు. టిప్పర్ రామడుగు శివారులోకి రాగానే రాత్రి 10:30 గంటలకు ముందస్తు పథకం ప్రకారం వాహనం చెడిపోయినట్లు ప్రదీప్.. నరేశ్‌కు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే నరేశ్.. వెంకటేశ్‌కు జాకీ ఇచ్చి.. తన అల్లుడు సాయితో స్కూటీపై టిప్పర్ వద్దకు పంపించాడు. ఆ తర్వాత మరో వాహనంపై నరేశ్ తన స్నేహితుడు రాకేశ్‌తో కలిసి వెళ్లాడు. అప్పటికే డ్రైవర్ ప్రదీప్ టిప్పర్‌ను స్టార్ట్ చేసిఉంచాడు. టైర్ కింద జాకీ పెట్టాలని వెంకటేశ్‌కు నరేశ్ చెప్పాడు. వెంకటేశ్ టైర్ కింద జాకీ పెట్టి తిప్పుతుండగా నరేశ్ టిప్పర్‌ను ముందుకు కదిలించి వెంకటేశ్‌పై నుంచి పోనిచ్చాడు. తీవ్రంగా గాయపడ్డ వెంకటేశ్ అక్కడికక్కడే మరణించాడు. టిప్పర్ డ్రైవర్ ప్రదీప్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందని, వెంకటేశ్ చనిపోయాడని నరేశ్ తన కుటుంబ సభ్యులకు, పోలీసులకు చెప్పాడు. పోలీసులకు అనుమానం వచ్చి లోతుగా విచారణ చేయగా.. బీమా డబ్బుల కోసమే వెంకటేశ్‌ను హత్య చేశారని తేలింది. ఈ కేసులో నిందితులందరినీ పోలీసులు అరెస్టు చేశారు.