Share News

Road Clash: గొడవ ఆపేందుకు వెళ్లి ప్రాణం పోగొట్టుకున్నాడు!

ABN , Publish Date - Dec 18 , 2025 | 03:25 AM

రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగగా.. ఆపేందుకు వెళ్లిన ఓ వ్యక్తిని ఇనుపచువ్వతో పొడవడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు..

Road Clash: గొడవ ఆపేందుకు వెళ్లి ప్రాణం పోగొట్టుకున్నాడు!

  • వైన్స్‌ ముందు రెండు బైకులు ఢీకొనడంతో ఇరు వర్గాల ఘర్షణ

  • నచ్చజెప్పేందుకు వెళ్లిన వ్యక్తినిఇనుప చువ్వతో పొడవడంతో మృతి

  • భద్రాచలంలో ఘటన

భద్రాచలం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగగా.. ఆపేందుకు వెళ్లిన ఓ వ్యక్తిని ఇనుపచువ్వతో పొడవడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.. భద్రాద్రి జిల్లా భద్రాచలంలోని చర్ల రోడ్డులో ఉన్న వైన్‌షాపు ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. చర్ల రోడ్డులో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆ సమయంలో బైకులపై ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్తా తీవ్రరూపం దాల్చి.. రెండు వర్గాలు పరస్పరం సీసాలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఆ గొడవలో ఉన్న తన బంధువును ఆపేందుకు పాల్వంచకు చెందిన వ్యాపారి సజ్జ రవి వర్మ (38) మధ్యలోకి వెళ్లాడు. దీంతో అతడిపై కూడా దాడికి దిగారు. రవివర్మను ఓ యువకుడు ఇనుప చువ్వతో ఛాతీపై పొడవడంతో అక్కడికక్కడే కుప్పకూలినట్టు తెలిసింది.వెంటనే అతడిని ఆటోలో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యుడు అప్పటికే మృతి చెందినట్టు వెల్లడించారు. భద్రాచలం సీఐ నాగరాజు, సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించి ఘటన వివరాలు తెలుసుకున్నారు. మృతుడు రవి వర్మకు భార్య జయశ్రీ, ముగ్గురు ఆడ పిల్లలు, ఒక బాబు ఉన్నారు. అతడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో 8 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

Updated Date - Dec 18 , 2025 | 03:25 AM