Share News

BC Reservation: బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మాహుతి !

ABN , Publish Date - Dec 06 , 2025 | 05:53 AM

రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై ఆత్మహత్యాయత్నం చేసిన సాయి ఈశ్వర్‌ చారి(38) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు....

BC Reservation: బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మాహుతి !

  • ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నకు చెందిన క్యూన్యూస్‌ కార్యాలయం వద్ద యువకుడి ఆత్మహత్యాయత్నం

  • ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

  • రేవంత్‌ రాక్షస రాజకీయ క్రీడలో ఈశ్వర్‌ బలి : హరీశ్‌ రావు

  • ఆత్మబలిదానం బాధాకరం: కవిత

  • బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి: బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌

అడ్డగుట్ట, హైదరాబాద్‌, న్యూఢిల్లీ, డిసెంబరు4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై ఆత్మహత్యాయత్నం చేసిన సాయి ఈశ్వర్‌ చారి(38) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. హైదరాబాద్‌లోని బోడుప్పల్‌ ప్రాంతంలో ఎమ్మెల్సీ చింతపండు నవీన్‌(తీన్మార్‌ మల్లన్న)కు చెందిన క్యూన్యూస్‌ కార్యాలయం వద్ద సాయి ఈశ్వర్‌ చారి గురువారం ఆత్మహత్యాయత్నం చేశారు. శరీరంపై కిరోసిన్‌ పోసుకొని నిప్పు పెట్టుకున్నారు. దాదాపు 90 శాతం కాలిన గాయాలతో ఉన్న ఈశ్వర్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. సంగారెడ్డి ప్రాంతంలోని పోచారం గ్రామానికి చెందిన సాయి ఈశ్వర్‌ చారి.. హైదరాబాద్‌ జగద్గిరిగుట్టలోని బీరప్పనగర్‌లో నివాసముంటూ క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేసేవారు. ఆయనకు భార్య కవిత, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

భగ్గుమన్న బీసీ నేతలు.. నేడు, రేపు నిరసనలు

సాయి ఈశ్వర్‌ చారి మరణించిన విషయం తెలియడంతో బీసీ నేతలు భగ్గుమన్నారు. గాంధీ ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో చేరుకొని ధర్నా చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక, ఈశ్వర్‌ చారి ఆత్మహత్యకు సీఎం రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కృష్ణయ్య విలేకరులతో మాట్లాడారు. రేవంత్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి బీసీ సమస్యల పరిష్కారం పట్ల ఒక్క శాతం కూడా చిత్తుశుద్ధి చూపలేదని ఆరోపించారు. బీసీ యువత బలిదానాలు ఆమోదయోగ్యం కాదని, రిజర్వేషన్ల కోసం రాజీ లేని పోరాటం సాగించాలని ఆర్‌.కృష్ణయ్య పిలుపునిచ్చారు. సాయి ఈశ్వర్‌ మృతి నేపథ్యంలో శని, ఆదివారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని బీసీ జేఏసీ చైర్మన్‌ జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల విషయంలో బీసీలకు అన్యాయం జరిగిందనే ఆవేదనతో ఈశ్వర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారని, బాధిత కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయాలని తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌ జి.నిరంజన్‌ అన్నారు.


బీసీ రిజర్వేషన్ల పేరిట రేవంత్‌రెడ్డి చేసిన మోసానికి నిండుప్రాణం బలైందని, సాయి ఈశ్వర్‌ చారి మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. సారు ుఈశ్వర్‌ మరణానికి రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలని, ఈశ్వర్‌ కుటుంబానికి ప్రభుత్వం రూ.50లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరిట సీఎం రేవంత్‌రెడ్డి ఆడిన రాక్షస రాజకీయ క్రీడలో సాయి ఈశ్వర్‌ బలైపోయాడని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బీసీ సమాజం క్షమించదన్నారు. సాయి ఈశ్వర్‌ చారి ఆత్మబలిదానం బాధాకరమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈశ్వర్‌ చారి భౌతికకాయానికి నివాళులర్పించిన కవిత బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు బలిదానాలు పరిష్కారం కాదని పేర్కొన్నారు.

Updated Date - Dec 06 , 2025 | 05:53 AM