ట్రాక్టర్ కిందపడి వ్యక్తి మృతి
ABN , Publish Date - Jul 28 , 2025 | 12:36 AM
ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది.
న్యాయం చేయాలని బంధువుల ఆందోళన
నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో ఘటన
శాలిగౌరారం, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. కట్టంగూరు మండలం కురుమర్తి గ్రామానికి చెందిన గండికోట శ్రీను(40) కుటుంబ సభ్యులతో కలిసి శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామంలో దగ్గరి బంధువు మృతిచెందగా అంత్యక్రియలకు వెళ్లాడు. సోమవారం సాయంత్రం గండికోట శ్రీను తన తల్లి లక్ష్మమ్మ, సోదరి సైదమ్మను బైక్ మీద తీసుకొని కురుమర్తికి బయలుదేరాడు. శాలిగౌరారం ఎంపీడీవో కార్యాలయం సమీపం వద్దకు రాగానే ముందుగా వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్ టేకు చేసే క్రమంలో ప్రమాదవశాత్తు అదుపు తప్పి వెనుక టైర్ కింద పడి శ్రీను అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చున్న శ్రీను తల్లి లక్ష్మమ్మ, సోదరి సైదమ్మ కుడి పక్కన పడడంతో ప్రాణాలతో బయటపడ్డారు. రోడ్డు మీద ప్రమాదం జరుగడంతో ట్రాఫిక్ త్రీవ అంతరాయం జరిగింది. న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ట్రాక్టర్ డైవ్రర్ అజాగ్రత్తతో శ్రీను మృతి చెందాడని ఆరోపించారు. శ్రీను మృత దేహాన్ని పోస్టమార్టం కోసం తీసుక వెళ్లడానికి పోలీసులు ట్రాక్టర్ తీసుక రాగా అడ్డుకున్నారు. శ్రీను కుటుంబానికి న్యాయం చేసేదాకా మృతదేహాన్ని తీసేదిలేదని భీష్మించుకుని కూర్చున్నారు. ఎస్‌ఐ సైదులు సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులకు ఎంత నచ్చచెప్పిన వినలేదు. న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటామని ఆందోళన చేశారు. శాలిగౌరారం - భైరవునిబండ మీద ఈ ప్రమాదం చోటుచేసుకోవడం ఈ మార్గంలో వాహనాలు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. వాహనాలు వెళ్లకుండా గడ్డి అడ్డవేసి అడ్డంగా కూర్చున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రమాదం జరగగా రాత్రి 9 దాటిన తరువాత కూడా కుటుంబ సభ్యులు ఆందోళన విరమించలేదు. ఈ ప్రమాదంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు చేస్తే కేస్ నమోదు చేస్తామని ఎస్‌ఐ సైదులు తెలిపారు.