Man Burned Alive as Car Catches Fire: ఓఆర్‌ఆర్‌పై కారు దగ్ధం.. ఒకరి సజీవ దహనం
ABN , Publish Date - Nov 25 , 2025 | 04:51 AM
హైదరాబాద్ శామీర్‌పేట్ వద్ద ఓఆర్‌ఆర్‌పై కారులో మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. డ్రైవర్ కారు ఆపి హీటర్ వేసుకుని నిద్రిస్తుండగా మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది....
మేడ్చల్ జిల్లా శామీర్‌పేట సమీపంలో ఘటన
శామీర్‌పేట, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ శామీర్‌పేట్ వద్ద ఓఆర్‌ఆర్‌పై కారులో మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. డ్రైవర్ కారు ఆపి హీటర్ వేసుకుని నిద్రిస్తుండగా మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. మృతుడిని హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం, జైగిరి గ్రామానికి చెందిన తల్లపల్లి దుర్గాప్రసాద్ (30)గా పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. వ్యాపార పనుల నిమిత్తం ఆదివారం హైదరాబాద్‌కు వచ్చిన దుర్గా ప్రసాద్.. తిరిగి సోమవారం వేకువజామున 4.30 గంటల సమయంలో స్వగ్రామానికి బయలుదేరాడు. ఆ సమయంలో చలి అధికంగా ఉండటంతో శామీర్‌పేట సమీపంలోని లియోనియో రిసార్ట్స్ వద్ద కారును రోడ్డు పక్కన ఆపి, హీటర్( వేడిగాలి) పెట్టుకుని నిద్రించాడు. కొద్దిసేపటి తర్వాత హీటర్ వేడికి ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లోనే వాహనం మొత్తం అంటుకున్నాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో నిద్రలో ఉన్న దుర్గాప్రసాద్ బయటకు రాలేక అగ్నికి ఆహుతయ్యాడు. శామీర్‌పేట పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.