Family Feud: 4 వేల అప్పు తీర్చమన్నందుకు కొట్టి చంపారు
ABN , Publish Date - Nov 18 , 2025 | 05:09 AM
అప్పుగా ఇచ్చిన రూ.4 వేలను తిరిగి ఇవ్వమని అడగడానికి వెళ్లిన ఓ వ్యక్తిని అతడి సమీస బంధువులు కొట్టి చంపారు. ఈ ఘటన ములుగు జిల్లాలోని లాలాయిగూడెం గ్రామంలో.....
సమీప బంధువుల ఘాతుకం.. ములుగు జిల్లాలో ఘటన
ములుగు రూరల్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): అప్పుగా ఇచ్చిన రూ.4 వేలను తిరిగి ఇవ్వమని అడగడానికి వెళ్లిన ఓ వ్యక్తిని అతడి సమీస బంధువులు కొట్టి చంపారు. ఈ ఘటన ములుగు జిల్లాలోని లాలాయిగూడెం గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకోంది. ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన ఎలక్ర్టీషియన్ జాడి సమ్మయ్య (38) ములుగు మండలంలోని లాలాయిగూడెం గ్రామానికి చెందిన దూరపు బంధువు సల్లూరి పవిత్రకు రూ.4 వేలు అప్పుగా ఇచ్చాడు. తిరిగి ఇవ్వమని పలుమార్లు ఫోన్ చేసి అడిగినా ఇవ్వకపోవడంతో ఆదివారం ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ సమ్మయ్యకు, పవిత్రకు మఽధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో పవిత్ర, ఆమె తాత సాంబయ్య, నానమ్మ అనసూర్యతో కలిసి సమ్మయ్యను ఇంటి ఎదురుగా ఉన్న సిమెంటు స్తంభానికి కట్టి తీవ్రంగా కొట్టారు. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. రాత్రైనా సమ్మయ్య ఇంటికి తిరిగి రాకపోవడంతో అతడి తమ్ముడు నాగరాజు లాలాయిగూడెంలోని మరో బంధువుకు ఫోన్ చేసి చెప్పాడు. అతడు పవిత్ర ఇంటికి వెళ్లి చూడగా కరెంటు స్తంభానికి వేలాడుతున్న సమ్మయ్య మృతదేహాన్ని చూసి నిర్ఘాంతపోయాడు. నాగరాజు ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.