Family Dispute: భార్యను చంపి వాట్సాప్ స్టేటస్.. ఆపై ఆత్మహత్య
ABN , Publish Date - Dec 14 , 2025 | 06:57 AM
కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్యను చంపి.. ఆత్మహత్య చేసుకున్నాడు. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం సీతారాంపురంలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
భూపాలపల్లి జిల్లాలో దారుణం
కుటుంబ కలహాలే కారణం
గణపురం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్యను చంపి.. ఆత్మహత్య చేసుకున్నాడు. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం సీతారాంపురంలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు.. స్థానికంగా ఉండే బాలాజీ రమణాచారి(55) మొదటి భార్య మరణించగా, సంధ్య(48)ను 20ఏళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. వీరి కూతురు 2నెలల క్రితం దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్లికి తల్లి సంధ్యే సహకరించిందని అనుమానిస్తూ రమణాచారి గొడవపడేవాడు. దీంతో సంధ్య నెల రోజుల క్రితం మైలారంలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే 11న పంచాయతీ ఎన్నికలు ఉండటంతో రమణాచారి సంధ్య దగ్గరికి వెళ్లి గొడవలొద్దని చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. ఆమెపై కోపం తగ్గని రమణాచారి.. శుక్రవారం రాత్రి సంధ్య నిద్రలోకి జారుకోగానే తాడుతో ఉరివేసి చంపాడు. అనంతరం పోలీసులను ఉద్దేశించి ఓ వీడియో రికార్డు చేశాడు. ‘నా భార్య నన్ను మానసికంగా వేధిస్తోంది. లేనిపోని అక్రమ సంబంధాలు అంటగడుతోంది. ఎంత కష్టపడి డబ్బులు తెచ్చి ఇచ్చినా, విలువ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇటీవల అనారోగ్యానికి గురైనప్పటికీ డబ్బులు సంపాదిస్తేనే సంసారం చేస్తా, లేకుంటే నాతో ఉండనని ఇబ్బందులు పెడుతోంది’ అని రమణచారి వీడియోలో పేర్కొన్నాడు. అనంతరం దాన్ని వాట్సాప్ స్టేట్‌స పెట్టి, ఇంట్లోనే ఉరేసుకున్నాడు. ఆ స్టేటస్ వీడియోను చూసిన బంధువులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు రమణాచారి ఇంటికి చేరుకుని పరిశీలించారు. రమణాచారి మొదటి భార్య ఇద్దరు కుమారులు ఇంటికి చేరుకొని.. సాయంత్రం మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు.