Family Dispute: పెళ్లికి నో చెప్పిందని...
ABN , Publish Date - Dec 09 , 2025 | 03:20 AM
పెళ్లి ప్రతిపాదనను నిరాకరించిందన్న ఆగ్రహంతో పట్టపగలే ఓ యువతి గొంతుకోసి దారుణంగా హత్యచేశాడో ఉన్మాది. మేనబావ వరసయ్యే ఆ యువకుడు..
మరదలిని కత్తితో గొంతు కోసి చంపిన మేనబావ
హైదరాబాద్ వారాసిగూడలో ఘటన
బౌద్ధనగర్, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): పెళ్లి ప్రతిపాదనను నిరాకరించిందన్న ఆగ్రహంతో పట్టపగలే ఓ యువతి గొంతుకోసి దారుణంగా హత్యచేశాడో ఉన్మాది. మేనబావ వరసయ్యే ఆ యువకుడు.. యువతి తల్లి కళ్లెదుటే దాడికి తెగబడి పరారయ్యాడు. ఈ ఘటన సోమవారం హైదరాబాద్ వారాసిగూడలో చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్శిగుట్ట బాపూజీనగర్‌లో పవిత్ర(19) తన కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటోంది. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా.. పవిత్ర ఇంటర్ పూర్తి చేసి, కంప్యూటర్ కోర్సులు నేర్చుకుంటోంది. ఈ క్రమంలో జవహర్‌నగర్‌లో నివాసముండే మేనబావ వరసయ్యే ఉమాశంకర్‌తో పవిత్ర వివాహం చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించారు. అయితే ఉమాశంకర్ తాగుబోతు కావడం, టైల్స్ పనిచేసే వృత్తిలో ఇంకా స్థిరపడకపోవడం వల్ల పవిత్ర కుటుంబం ఆ తర్వాత పెళ్లికి నిరాకరించింది. దాంతో వారి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఆదివారం పవిత్ర కుటుంబం విజయవాడకు అమ్మవారి దర్శనానికి వెళ్లి సోమవారం తిరిగి వచ్చింది. సోమవారం మధ్యాహ్నం పవిత్ర ఇంటికి వచ్చిన ఉమాశంకర్.. తనకు చెప్పకుండా విజయవాడ ఎందుకు వెళ్లావని యువతిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనంతరం వారిద్దరూ పెళ్లి విషయమై గొడవపడ్డారు. దాంతో ఉమాశంకర్ వెంట తెచ్చుకున్న కత్తితో పవిత్ర గొంతు నరకడంతో తీవ్ర రక్తస్రావమై.. ఆమె మృతిచెందింది. పవిత్ర తల్లి కేకలు వేస్తుండడంతో భయంతో ఉమాశంకర్ కత్తిని వదిలిపెట్టి పారిపోయాడు.