Cybercriminal: ట్రేడింగ్‌లో లాభాలంటూ మోసం
ABN , Publish Date - Oct 20 , 2025 | 04:26 AM
ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో అధిక లాభాలంటూ.. నమ్మించి రూ. లక్షలు కొల్లగొడుతున్న సైబర్ క్రిమినల్స్‌కు సహకరిస్తున్న నిందితుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు...
సైబర్ క్రిమినల్స్‌కు బ్యాంకు ఖాతాలు అద్దెకిస్తున్న నిందితుడి అరెస్టు
సైబర్ నేరగాళ్ల నుంచి నిందితుడికి 20 శాతం కమీషన్
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో అధిక లాభాలంటూ.. నమ్మించి రూ. లక్షలు కొల్లగొడుతున్న సైబర్ క్రిమినల్స్‌కు సహకరిస్తున్న నిందితుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అనంతపురానికి చెందిన కందుకూరు సుల్తాన్ అహ్మద్‌ఖాన్‌ను ఈ కేసులో అరెస్టు చేశారు. డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కళ్యాణ్‌నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తికి వాట్సా్‌పలో ఒక సందేశం వచ్చింది. ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే స్వల్ప కాలంలోనే అధిక లాభాలు వస్తాయని అందులో ఉంది. ఆ మెసేజ్ లింకును తెరవగానే గుర్తుతెలియని వ్యక్తులు లైన్‌లోకి వచ్చారు. ట్రేడింగ్ గురించి, అందులో వచ్చే లాభాల గురించి, ఇన్వె్‌స్టమెంట్ చేయాల్సిన గ్రూపుల గురించి వివరించారు. నవుమా 915 ఇన్‌సైట్ స్టాక్స్ అనే గ్రూపులో బాధితుణ్ని చేర్పించారు. ముందుగా స్వల్ప మొత్తంలో పెట్టుబడులు పెట్టించి మంచి లాభాలు చూపించారు. ఆ తర్వాత నెమ్మదిగా బాధితుడి నుంచి రూ. 24.71 లక్షల పెట్టుబడులు పెట్టించారు. కొద్ది రోజుల తర్వాత లాభాలతో కలిపి రూ. 40.60 లక్షలు వచ్చినట్లు చూపించారు. ఎక్కువ మొత్తంలో లాభాలు వచ్చాయని సంతోష పడిన బాధితుడు వాటిని విత్‌డ్రా చేసుకోవాలని ప్రయత్నించగా ఆ ఆప్షన్ క్లోజ్ చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే అదనంగా రూ. 23 లక్షలు చెల్లించాలన్నారు. దాంతో బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించి.. బాధితుడు చెల్లించిన డబ్బు అనంతపురానికి చెందిన సుల్తాన్ అహ్మద్ ఖాన్ ఖాతాకు చేరినట్లు గుర్తించారు. నిందితుడి కోసం గాలించి తిరుపతిలో అరెస్టు చేశారు. అతడిని విచారించగా సైబర్ క్రిమినల్స్‌కు తన బ్యాంకు ఖాతాను రూ. 2 లక్షల కమీషన్‌పై అద్దెకు ఇచ్చినట్లు తేలింది. అంతేకాకుండా అతను మరికొన్ని బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి 20 శాతం కమీషన్‌కు సైబర్ క్రిమినల్స్‌కు అద్దెకు ఇచ్చినట్లు తెలిసింది. ఆయా ఖాతాల్లో ఇప్పటి వరకు రూ. 3 కోట్ల వరకు అనధికారిక లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఇతనిపై 15 కేసులు నమోదయ్యాయి. కాగా.. ఏపీ, తెలంగాణలో 8 కేసులు ఉన్నట్లు గుర్తించారు.