Share News

Love Suicide: భద్రాచలంలో ప్రేమజంట ఆత్మహత్య

ABN , Publish Date - Sep 06 , 2025 | 03:53 AM

భార్యా ముగ్గురు పిల్లలున్నా.. సభ్యత మరిచి దూరపు బంధువైన మైనర్‌తో ప్రేమాయణం నడిపిన యువకుడు...

Love Suicide: భద్రాచలంలో ప్రేమజంట ఆత్మహత్య

  • మైనర్‌తో ముగ్గురు పిల్లల తండ్రి ప్రేమాయణం

  • మృతుడిది ఏపీ.. బాలిక భద్రాద్రి జిల్లా వాసి

భద్రాచలం/కుక్కునూరు,సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): భార్యా ముగ్గురు పిల్లలున్నా.. సభ్యత మరిచి దూరపు బంధువైన మైనర్‌తో ప్రేమాయణం నడిపిన యువకుడు.. ఇరు కుటుంబాలు ఆగ్రహించడంతో ఆ బాలికతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శుక్రవారం జరిగింది. ఏపీలోని ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం పెదరావిపాడు వాసి నడిపింటి రవి(34) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(16)తో ప్రేమలో పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యులు వారించినా వినకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఫిబ్రవరి 5న అశ్వాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రవిపై పోక్సో కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. బెయిల్‌పై వచ్చాక కూడా ప్రవర్తన మార్చుకోకపోవడంతో వారి తీరుపై ఇరు కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో మనస్తాపానికి గురైన రవి, బాలికతో కలిసి 2 రోజుల క్రితం భద్రాచలం వచ్చి.. కరకట్ట సమీపంలోని ప్రైవేటు లాడ్జిలో దిగాడు. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆ గదిలో నుంచి వస్తువులు పడిన శబ్దాలు రావడంతో లాడ్జి సిబ్బంది తలుపులు తెరిచి వారిద్దరినీ భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రికెళ్లేలోపు రవి మృతి చెందగా, బాలిక చికిత్స పొందుతూ మరణించింది. మనస్తాపంతోనే ఆ బాలికతో కలిసి రవి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు.

Updated Date - Sep 06 , 2025 | 03:53 AM