Share News

IPS Transfers: హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్‌

ABN , Publish Date - Sep 28 , 2025 | 01:31 AM

రాష్ట్ర డీజీపీగా శివధర్‌రెడ్డిని నియమించిన ప్రభుత్వం.. గంటల వ్యవధిలోనే కీలక స్థానాల్లో ఉన్న ఐపీఎ్‌సలను బదిలీ చేసింది...

IPS Transfers: హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్‌

  • హైదరాబాద్‌ సీపీగా సజ్జనార్‌.. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా విజయ్‌.. ఒకే సారి 23 మంది ఐపీఎస్‌ల బదిలీ

హైదరాబాద్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర డీజీపీగా శివధర్‌రెడ్డిని నియమించిన ప్రభుత్వం.. గంటల వ్యవధిలోనే కీలక స్థానాల్లో ఉన్న ఐపీఎ్‌సలను బదిలీ చేసింది. ఒకేసారి 23మంది అధికారులను బదిలీ చేస్తూ సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌ సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌ను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్‌ను హైదరాబాద్‌ కమిషనర్‌గా బదిలీ చేసింది. త్వరలో పదవీ విరమణ చేయనున్న హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తాకు సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వీసీగా బాధ్యతలు అప్పగించింది. ఇక, ఏసీబీ డీజీగా ఉన్న విజయ్‌కుమార్‌ను ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా నియమించింది. సీఐడీ ఏడీజీ చారుసిన్హాకు ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డీజీగా ఉన్న షికా గోయల్‌ను విజిలెన్స్‌ డీజీగా నియమించినా, తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌చార్జి పదవిలోనే ఉండాలని ఆదేశించింది. హోంగార్డ్స్‌ విభాగం ఏడీజీ స్వాతి లక్రాకు ఎస్‌పీఎఫ్‌ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. లా అండ్‌ ఆర్డర్‌ అదనపు డీజీగా ఉన్న మహేశ్‌ భగవత్‌కు ఏడీజీ పర్సనల్‌గా అదనపు బాధ్యత లు అప్పగించి, ఆ పదవిలో ఉన్న అనిల్‌ కుమార్‌ను గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ దళాల ఏడీజీగా నియమించింది. ఫైర్‌ సర్వీసు డీజీగా ఉన్న నాగిరెడ్డిని ఆర్టీసీ ఎండీగా బదిలీ చేసింది. పౌరసరఫరాల శాఖ ఎండీగా ఉన్న దేవేంద్రసింగ్‌ చౌహన్‌ను మల్టీజోన్‌-2 ఏడీజీగా నియమించింది. హైదరాబాద్‌ అదనపు కమిషనర్‌గా ఉన్న విక్రమ్‌ సింగ్‌ మాన్‌ను ఫైర్‌ సర్వీసెస్‌ డీజీగా, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా స్టీఫెన్‌ రవీంద్ర, హైదరాబాద్‌ క్రైమ్స్‌ అదనపు కమిషనర్‌గా శ్రీనివాసులును నియమించింది. త్వరలో మరింత మంది ఐపీఎ్‌సల బదిలీలు జరగనున్నాయని సమాచారం.

Updated Date - Sep 28 , 2025 | 01:31 AM