Drug Bust: 220 కిలోల ఎపిడ్రిన్ స్వాధీనం
ABN , Publish Date - Oct 10 , 2025 | 03:50 AM
అత్యంత ప్రమాదకరమైన ఎపిడ్రిన్ మత్తుమందు తయారీ ముఠా గుట్టురట్టయింది. ఈ ముఠాకు చెందిన నలుగురిని హైదరాబాద్ ఈగల్ బృందాలు జీడిమెట్లలో...
హైదరాబాద్, అక్టోబరు9 (ఆంధ్రజ్యోతి): అత్యంత ప్రమాదకరమైన ఎపిడ్రిన్ మత్తుమందు తయారీ ముఠా గుట్టురట్టయింది. ఈ ముఠాకు చెందిన నలుగురిని హైదరాబాద్ ఈగల్ బృందాలు జీడిమెట్లలో అరెస్టు చేశాయి. వీరి వద్ద నుంచి 220 కిలోల ఎపిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. దేశీయ మార్కెట్‌లో దీని విలువ రూ.10కోట్లు, అంతర్జాతీయ మార్కెట్లో రూ.70 కోట్లు ఉంటుందని ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. శాండిల్య వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన వత్సవాయి శివరామ కృష్ణ పరమావర్మ కొన్నాళ్లు సిరిస్ తదితర కెమికల్ కంపెనీల్లో పనిచేశారు. గతంలో రెండుసార్లు అల్ర్పాజోలం తదితర మత్తుమందులు అమ్ముతూ పట్టుబడ్డాడు. కాకినాడకు చెందిన అనిల్ సైతం చాలా ఏళ్లుగా వివిధ రసాయన పరిశ్రమల్లో పనిచేస్తున్నాడు. వర్మ, అనిల్ పాత మిత్రులు కావడంతో గత ఏడాది ఇద్దరూ కలిసి మత్తుమందుల తయారీకి పథకం రచించారు. తాను పనిచేస్తున్న పీఎన్‌ఎం లైఫ్ సైన్సెస్ సంస్థలో డ్రగ్స్ తయారీకి కావాల్సిన వసతులున్నాయని, యజమానులైన వెంకటకృష్ణ, ప్రసాద్‌లతో మాట్లాడుదామని అనిల్ చెప్పడంతో అందరూ ఓ హోటల్‌లో కలిశారు. మంచి కమీషన్ ఇస్తామని వర్మ చెప్పడంతో వెంకటకృష్ణ, ప్రసాద్‌లు అంగీకరించారు. దూలపల్లిలోని పీఎన్‌ఎం లైఫ్ సైన్సె్‌సలో ఎపిడ్రిన్ తయారీకి వీరి మధ్య ఒప్పందం కుదిరింది. వర్మ ఇచ్చిన ఫార్ములా ప్రకారం అనిల్ 220 కిలోల ఎపిడ్రిన్ సిద్ధం చేశాడు. దీని అమ్మకానికి వర్మ తన ఇంట్లో పలువురితో ఇటీవల సమావేశమయ్యారు. కాగా, గతంలో మత్తుమందుల కేసుల్లో పట్టుబడి బెయిల్‌పై బయటకు వచ్చిన వారి కదలికలను ఈగల్ బృందాలు గమనిస్తున్నాయి. ఈ క్రమంలో వర్మ కదలికలపై అనుమానంతో అతడిని ఈగల్ బృందాలు వెంటాడాయి. గురువారం జీడిమెట్లలోని వర్మ ఇంట్లో సమావేశమైన ముఠా సభ్యులను అరెస్టు చేశాయి. వర్మ, అనిల్, వెంకట కృష్ణ, ప్రొడక్షన్ వర్కర్ దొరబాబును అరెస్టు చేశామని, ప్రసాద్ పరారీలో ఉన్నట్టు సందీప్ శాండిల్య తెలిపారు.