Majlis Party: తప్పుకొన్న మజ్లిస్?
ABN , Publish Date - Oct 08 , 2025 | 04:32 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మజ్లిస్ పార్టీ అభ్యర్థిని బరిలో నిలపకుండా నేరుగా కాంగ్రె్‌సకు మద్దతు పలకనుందా? బదులుగా జీహెచ్‌ఎంసీ మేయర్ పదవిని డిమాండ్ చేయనుందా....
అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతు!
జీహెచ్‌ఎంసీ మేయర్ పదవి కోసమే..?
హైదరాబాద్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మజ్లిస్ పార్టీ అభ్యర్థిని బరిలో నిలపకుండా నేరుగా కాంగ్రె్‌సకు మద్దతు పలకనుందా? బదులుగా జీహెచ్‌ఎంసీ మేయర్ పదవిని డిమాండ్ చేయనుందా? అంటే మజ్లిస్ పార్టీ నేతలు కొందరు ఔననే అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌ను రెండుగా విభజించే యోచనలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పాతనగర ప్రాంతం పరిధికి వచ్చే కార్పొరేషన్‌కు మేయర్‌గా తమ పార్టీ అభ్యర్థి ఉండేలా మజ్లిస్ ఇప్పటి నుంచే పావులు కదుపుతోందని అంటున్నారు. వాస్తవానికి మజ్లిస్ పార్టీకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గట్టిపట్టుంది. 2014 శాసనసభ ఎన్నికల్లో ఓట్ల పరంగా రెండో స్థానంలో నిలిచింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గంలో ముస్లింలు ఎక్కువగా నివసించే షేక్‌పేట, రహ్మత్‌నగర్, ఎర్రగడ్డ, యూసు్‌ఫగూడ ప్రాంతాల్లో మజ్లిస్ పార్టీకి పట్టుంది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో షేక్‌పేట, రహ్మత్‌నగర్ డివిజన్ల నుంచి మజ్లిస్ అభ్యర్థులు కార్పొరేటర్లుగా విజయం సాధించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అభ్యర్ధిని నిలపాలని మజ్లిస్ తొలుత భావించినప్పటికీ తాజాగా పోటీపై పునరాలోచన చేస్తున్నట్లు తెలిసింది. సమీప భవిష్యత్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రె్‌సకు మద్దతు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా, జూబ్లీహిల్స్‌లో అభ్యర్థిని ఖరారు చేసే అంశంలో కాంగ్రెస్ పార్టీ ఒవైసీ సూచనలను పరిగణనలోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.