Share News

Crop Procurement Begins: పంటల కొనుగోళ్లకు వేళాయె!

ABN , Publish Date - Oct 15 , 2025 | 05:04 AM

రాష్ట్రంలో వానాకాలంలో రైతులు పండించిన పంటల సేకరణ మొదలైంది. మూడు ప్రధాన పంటలైన వరి, పత్తి, మొక్కజొన్నల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది...

Crop Procurement Begins: పంటల కొనుగోళ్లకు వేళాయె!

  • నేటి నుంచి మక్కల సేకరణ

  • 21 నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు

  • 6 జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు షురూ

హైదరాబాద్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వానాకాలంలో రైతులు పండించిన పంటల సేకరణ మొదలైంది. మూడు ప్రధాన పంటలైన వరి, పత్తి, మొక్కజొన్నల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నోడల్‌ ఏజెన్సీ అయిన మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో బుధవారం నుంచి మక్కల కొనుగోళ్లకు శ్రీకారం చుడుతోంది. ధాన్యం సేకరణ 6 జిల్లాల్లో ప్రారంభం కాగా.. నవంబరు నాటికి వేగం పుంజుకోనుంది. ఇక భారత పత్తి సంస్థ(సీసీఐ) దీపావళి పండగ మరుసటి రోజు నుంచి రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లను ప్రారంభించనుంది. వానాకాలం సీజన్‌లో రాష్ట్రంలో 68 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా.. కోటిన్నర లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేశారు. రూ.21,112 కోట్లు సమీకరించి.. 80 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ నెల 1 నుంచి రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు శ్రీకారం చుట్టింది. నిజామాబాద్‌, కామారెడ్డి, నల్లగొండ, సిరిసిల్ల, భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో ప్రస్తుతం ధాన్యం సేకరణ చేపట్టారు. మరో పక్షం రోజుల్లో ధాన్యం సేరకణ జోరందుకోనుంది.

21 నుంచి పత్తి కొనుగోళ్లు

ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, సీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. జాబ్‌ వర్క్‌ టెండర్లలో జిన్నింగ్‌ మిల్లర్లు తొలుత పాల్గొనకపోవడం, ఆ తర్వాత మంత్రి తుమ్మల చర్చలు జరపడంతో సమస్య తొలగిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 328 జిన్నింగ్‌ మిల్లుల్లో దీపావళి తర్వాత నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభించనున్నారు. 43.29లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగుచేయగా.. 24.70లక్షల టన్నుల పత్తి ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేశారు. ‘కపాస్‌ కిసాన్‌’ యాప్‌ ద్వారా నమోదు చేసుకొన్న రైతులే పత్తి విక్రయించేలా సీసీఐ ఏర్పాట్లు చేసింది.

నేటి నుంచి మక్కల కొనుగోళ్లు

రాష్ట్రంలో బుధవారం నుంచి మక్కల కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. వానాకాలంలో 6,24,544 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగుచేశారు. ఈ మేరకు 8.66 లక్షల టన్నుల మక్కలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబరు మూడో వారం నుంచే మక్కలు మార్కెట్లోకి రావడం ప్రారంభమైంది. కనీస మద్దతు ధర రూ.2,400 కాగా.. మార్కెట్‌ ధర రూ.1,800-2000 ఉంది. ఈ పరిస్థితుల్లో మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.

Updated Date - Oct 15 , 2025 | 05:04 AM