Share News

Rythu Problems: మొక్కజొన్న రైతు పరేషాన్‌

ABN , Publish Date - Oct 05 , 2025 | 05:13 AM

ఆరుగాలం శ్రమించిన తర్వాత చేతికొచ్చిన పంటను విక్రయించేందుకు మొక్కజోన్న రైతులు అవస్థలు పడుతున్నారు. మార్క్‌ఫెడ్‌ అధికారులు కోనుగోలు కేంద్రాలను....

Rythu Problems: మొక్కజొన్న రైతు పరేషాన్‌

  • జగిత్యాల జిల్లాలో మార్కెట్‌కు చేరుతున్న మక్కలు

  • ఇంకా తెరుచుకోని మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాలు

  • ఇదే అదనుగా క్వింటాకు రూ.400 వరకు ధర తగ్గిస్తున్న దళారులు

  • కనీస మద్దతు ధర కూడా దక్కని వైనం

జగిత్యాల, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆరుగాలం శ్రమించిన తర్వాత చేతికొచ్చిన పంటను విక్రయించేందుకు మొక్కజోన్న రైతులు అవస్థలు పడుతున్నారు. మార్క్‌ఫెడ్‌ అధికారులు కోనుగోలు కేంద్రాలను తెరవకపోవడంతో దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారు. ప్రస్తుతం మక్కలకు కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.2,400గా ఉంది. అయితే, మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో జగిత్యాల జిల్లాలోని వ్యాపారులు క్వింటాలుకు రూ.2,000 నుంచి రూ.2,100 వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. తరుగు పేరిట క్వింటాలుకు నాలుగు కిలోల వరకు, క్యాష్‌ కటింగ్‌ పేరిట రెండు శాతం కోతలు పెడుతున్నారు. తూకాల్లో కూడా మోసాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 6.09 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంట వేశారు. జగిత్యాల జిల్లాలో 32,805 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు ఉండగా సుమారు 15.83 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, కథలాపూర్‌, మల్లాపూర్‌, మెట్‌పల్లి, మేడిపల్లి మండలాల్లో అధికంగా మొక్కజొన్న సాగవుతోంది. జిల్లాలో ఇప్పుడిప్పుడే మక్కలు మార్కెట్‌కు వస్తుండగా, వారం పది రోజుల్లో అధిక మొత్తంలో మార్కెట్‌కు చేరే అవకాశముంది.

ధరల కోత..

జగిత్యాల జిల్లాలో వారం, పది రోజుల క్రితం వరకు మొక్కజొన్న క్వింటాలు రూ.2,300 వరకు పలికింది. పంట చేతికొచ్చే తరుణంలో ప్రస్తుతం ధర పతనమవుతోంది. మార్క్‌ఫెడ్‌ కేంద్రాలు ప్రారంభం కాకపోవడం వల్లే వ్యాపారులు, దళారులు కలిసి ధరలు తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కనీస మద్దతు ధర కంటే తక్కువ ధర చెల్లిస్తున్నారని వాపోతున్నారు. ఇదే తీరు కొనసాగితే జిల్లాలోని మొక్కజొన్న రైతులు భారీగా నష్టపోయే ముప్పు ఉంది. ప్రస్తుత సీజన్‌లో మొక్కజొన్న కొనుగోళ్లను మార్క్‌ఫెడ్‌ చేపట్టడంపై స్పష్టత రావడం లేదు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోవడంతో మార్క్‌ఫెడ్‌ కేంద్రాలను తెరిచే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుత సీజన్‌లో అధిక వర్షాలతో కష్టాల్లో ఉన్న రైతులకు ఈ పరిణామం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మార్క్‌ఫెడ్‌ ద్వారా మొక్కజొన్న కొనుగోళ్లు జరిపించాలని అన్నదాతలు కోరుతున్నారు. ఈ విషయమై ఇటీవల పలువురు రైతులు జగిత్యాల అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ కూడా ఇచ్చారు. దీంతో ప్రభుత్వ స్పందన కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.


ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవాలి

ప్రస్తుత వానాకాలం సీజన్‌లో పండించిన మొక్కజొన్నను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కేంద్రాలు తెరవాలి. మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మార్కెట్‌లో దళారులు ధరలు తగ్గించడంతో పాటు క్యాష్‌ కటింగ్‌, తేమ పేరుతో ధర తగ్గింపు, తూకంలో హెచ్చు తగ్గులు వంటి అవకతవకలకు పాల్పడుతున్నారు.

-పన్నాల తిరుపతిరెడ్డి,

రైతు ఐక్య వేదిక నాయకుడు, జగిత్యాల జిల్లా

Updated Date - Oct 05 , 2025 | 05:13 AM