Share News

Mahesh Kumar Goud: కేసీఆర్‌ దీక్ష ఓ నాటకం

ABN , Publish Date - Nov 29 , 2025 | 03:39 AM

రాష్ట్రంలో ఉనికి కోల్పోతున్న బీఆర్‌ఎస్‌ పార్టీ.. దీక్షా దివస్‌ పేరుతో కొత్త డ్రామాకు తెరలేపిందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు...

Mahesh Kumar Goud: కేసీఆర్‌ దీక్ష ఓ నాటకం

  • నిమ్స్‌ ఆస్పత్రిలో ఫ్లూయిడ్స్‌ తీసుకున్నారు

  • తెలంగాణ వచ్చింది సోనియా చలవ వల్లే

  • దీక్షా దివస్‌ పేరుతో బీఆర్‌ఎస్‌ కొత్త డ్రామా

  • స్థానిక ఎన్నికల్లోనూ ఆ పార్టీ గల్లంతు ఖాయం

  • కోమటిరెడ్డిపై కైలాష్‌ వ్యాఖ్యలు మూడేళ్ల కిందటివి

  • అప్పట్లోనే క్షమాపణలు చెప్పారు: మహేశ్‌ గౌడ్‌

  • మహాత్మా జ్యోతిరావు ఫూలేకు టీపీసీసీ చీఫ్‌ నివాళి

హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉనికి కోల్పోతున్న బీఆర్‌ఎస్‌ పార్టీ.. దీక్షా దివస్‌ పేరుతో కొత్త డ్రామాకు తెరలేపిందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌ దీక్ష వల్ల రాలేదని, సోనియాగాంధీ చలవ వల్లే వచ్చిందని పేర్కొన్నారు. 2009లో కేసీఆర్‌ చేపట్టిన దీక్ష పూర్తిగా నాటకమని వ్యాఖ్యానించారు. శుక్రవారం గాంధీభవన్‌లో మహేశ్‌గౌడ్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్‌ బయటికి వస్తే ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడిందని, బీఆర్‌ఎస్‌ శకం ముగిసిన విషయాన్ని ఆయన స్వయంగా అర్థం చేసుకున్నారని అన్నారు. రాష్ట్రం కోసం దీక్ష చేస్తున్నట్లు ప్రకటించిన కేసీఆర్‌.. నిమ్స్‌ ఆస్పత్రిలో ఫ్లూయిడ్స్‌ తీసుకున్నారని, ఇందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. నిజమైన దీక్ష అంటే మణిపూర్‌ ఐరన్‌ లేడీ ఇరోమ్‌ షర్మిలదని అన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలకు చిత్తశుద్ధి ఉంటే.. ముందుగా ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరులకు నివాళులర్పించాలని సూచించారు. సోనియాగాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదని స్వయంగా కేసీఆర్‌ అంగీకరించారని గుర్తు చేశారు. ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు ఉద్యమానికి ఊపిరిగా నిలిచారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడింది అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం, నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాజకీయ చాణక్యమేనని తెలిపారు.

స్థానిక ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌ గల్లంతే..

లోక్‌సభ ఎన్నికలు, కంటోన్మెంట్‌, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల తరహాలోనే స్థానిక ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌ గల్లంతవుతుందని మహేశ్‌గౌడ్‌ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ కట్టుబడే ఉందన్నారు. ఈ అంశంలో బీసీ ప్రజానీకం ప్రతిపక్ష బీజేపీ, బీఆర్‌ఎ్‌సల ప్రజా ప్రతినిధులను నిలదీయాలని సూచించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఉద్దేశించి నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు కైలాష్‌ నేత మాట్లాడిన వీడియో మూడేళ్ల కిందటిదని, ఆ వ్యాఖ్యలపై అప్పుడే ఆయన బహిరంగ క్షమాపణలు కూడా చెప్పారని తెలిపారు. ఇక టీపీసీసీ డాక్టర్స్‌ సెల్‌ ప్రతినిధులు ఒక్కొక్కరు ఒక్కో రోజు గాంధీభవన్‌లో వైద్య సేవలు అందించాలని మహేశ్‌గౌడ్‌ కోరారు. డాక్టర్స్‌ సెల్‌ వైస్‌ చైర్మన్‌, జనరల్‌ సెక్రటరీతోపాటు ఐదు జిల్లాలకు చైర్మన్లను ప్రకటించి నియామక పత్రాలు అందజేశారు. కాగా, శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి టీపీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌గౌడ్‌ నివాళి అర్పించారు.


అభినవ గోబెల్స్‌ కేటీఆర్‌: మేడిపల్లి సత్యం

కేసీఆర్‌ అనే నియంత పెంపకంలో కేటీఆర్‌ అభినవ గోబెల్స్‌లా తయారయ్యారని కరీంనగర్‌ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే ఆయన పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. శుక్రవారం సీఎల్పీ మీడియా హాల్లో ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఎన్నికల్లోనూ చిత్తవుతున్నా కేటీఆర్‌లో మార్పు రావడంలేదన్నారు. పారిశ్రామిక భూముల బదలాయింపు పూర్తి పారదర్శకంగా జరుగుతుంటే.. కేటీఆర్‌, హరీశ్‌రావుకు మాత్రం అందులో రూ.లక్షల కోట్ల కుంభకోణాలు కనిపిస్తున్నాయని విమర్శించారు.

Updated Date - Nov 29 , 2025 | 03:39 AM