Share News

Mahesh Goud Donates Land: పుట్టి పెరిగిన ఊరు రుణం తీర్చుకుంటా..

ABN , Publish Date - Nov 24 , 2025 | 04:19 AM

తాను పుట్టి పెరిగిన మారుమూల గ్రామమైన రహత్‌నగర్‌ రుణం తీర్చుకుంటానని.. రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చుదిద్దుతానని ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ అన్నారు....

Mahesh Goud Donates Land: పుట్టి పెరిగిన ఊరు రుణం తీర్చుకుంటా..

  • రహత్‌నగర్‌ను ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతా: మహేశ్‌ గౌడ్‌

  • 11 ఎకరాల భూమిని గ్రామాభివృద్ధికి విరాళం ఇచ్చిన పీసీసీ చీఫ్‌

భీమ్‌గల్‌ రూరల్‌/నిజామాబాద్‌ సిటీ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): తాను పుట్టి పెరిగిన మారుమూల గ్రామమైన రహత్‌నగర్‌ రుణం తీర్చుకుంటానని.. రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చుదిద్దుతానని ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ అన్నారు. తన తల్లిదండ్రులు చేసిన సేవల వల్లే ఈ స్థాయికి ఎదిగానని చెప్పారు. నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలంలోని రహత్‌నగర్‌లో దుర్గాదేవి ఆలయ నిర్మాణానికి దేవాదాయ శాఖ నుంచి రూ.50 లక్షలను మంజూరు చేయించిన మహేశ్‌ గౌడ్‌.. ఆ నిర్మాణ పనులకు స్థానిక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి ఆదివారం భూమి పూజ చేశారు. మహేశ్‌ గౌడ్‌ ఊరిలోకి అడుగుపెట్టగానే గ్రామస్థులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రహత్‌నగర్‌ గ్రామాభివృద్ధి కోసం మహేశ్‌ గౌడ్‌ తన 11 ఎకరాల సొంత భూమిని విరాళంగా ఇచ్చి దాతృత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌కు 10 ఎకరాలు, సబ్‌ స్టేషన్‌కు ఎకరా భూమి ఇచ్చానని, తన గ్రామానికి ఎంత సేవ చేసినా తక్కువేనన్నారు. రహత్‌నగర్‌ మీదుగా కొండగట్టు ఆంజనేయ స్వామి, వేములవాడ, ధర్మపురి దేవాలయాలను కలుపుతూ టెంపుల్‌ కారిడార్‌ రోడ్డు నిర్మాణానికి రూ.380 కోట్లు మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల తమ గ్రామం అభివృద్ధి జరుగుతుందన్నారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఆయన ఎగరవేశారు. ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలను అందజేశారు.

కాంగ్రెస్‌ హయాంలోనే బీసీలకు ప్రాధాన్యం..

తెలంగాణలో బీసీలు 65 శాతం మంది ఉన్నారని, బీసీలంతా ఏకం కావాల్సిన అవసరముందని మహేశ్‌ గౌడ్‌ అన్నారు. కాంగ్రెస్‌ హయాంలోనే బీసీలకు ప్రాధాన్యం దక్కిందని.. అరుగుల రాజారాం, వి.హనుమంతరావు, డి.శ్రీనివాస్‌ వంటి వారిని పీసీసీ చీఫ్‌లుగా నియమించారని గుర్తు చేశారు. నిజామాబాద్‌లోని ప్రగతినగర్‌ మున్నూరుకాపు సంఘంలో జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ధర్మపురి సంజయ్‌ ప్రమాణస్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరై మహేశ్‌ గౌడ్‌ ప్రసంగించారు. కాంగ్రెస్‌ బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్‌కు పంపిందని గుర్తు చేశారు. నూతనంగా నియమించిన డీసీసీ, సీసీసీ అధ్యక్షుల్లో 75 శాతం మంది బీసీలనే నియమించామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్యే ఆర్‌.భూపతిరెడ్డి, పలు కార్పొరేషన్ల చైర్మన్లు ఈరవత్రి అనిల్‌, అన్వేష్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Nov 24 , 2025 | 04:19 AM