TPCC chief Mahesh Kumar Goud: కళాకారులకు ప్రాంతం ఉండదు..
ABN , Publish Date - Dec 05 , 2025 | 03:16 AM
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దేశం గర్వించదగిన గాయకుడని, రవీంద్రభారతిలో ఆయన విగ్రహం ఏర్పాటుపై రాద్ధాంతం చేయడం తగదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. అసలు కళాకారులకు ప్రాంతాలు ఆపాదించడం సరికాదని వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు భౌగోళికంగా విడిపోయినా..
ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటుపై రాద్ధాంతం తగదు
కులం, మతం లేకుండా బీజేపీ నేతలకు పూట గడవదు
ఢిల్లీ పరిస్థితి హైదరాబాద్‌కు రావద్దనే హిల్ట్: మహేశ్‌గౌడ్
హైదరాబాద్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దేశం గర్వించదగిన గాయకుడని, రవీంద్రభారతిలో ఆయన విగ్రహం ఏర్పాటుపై రాద్ధాంతం చేయడం తగదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. అసలు కళాకారులకు ప్రాంతాలు ఆపాదించడం సరికాదని వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు భౌగోళికంగా విడిపోయినా.. తెలుగు వారంతా అన్నదమ్ముల్లా కలిసే ఉండాలని ఆకాంక్షించారు. గురువారం గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కులం, మతం ప్రస్తావన లేకుండా బీజేపీ వారికి పూట కూడా గడవదని.. దేవుళ్ల గురించి ఒక సామెత రూపంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడితే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని ఆక్షేపించారు. కులం, మతం పేరిట రాజకీయాలను తెలంగాణ ప్రజలు జీర్ణించుకోరన్నారు. అసలు అభివృద్ధి గురించి బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరానికి ఢిల్లీ తరహా పరిస్థితి రాకూడదనే హిల్ట్ పాలసీని తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ పాలసీతో హైదరాబాద్‌లో కాలుష్యం తగ్గడంతో పాటుగా భూముల ధరలూ తగ్గి మధ్య తరగతి వారికి అందుబాటులోకి వస్తాయన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. హిల్ట్ పాలసీపై విమర్శలు చేయడం దారుణమని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ నేతలు పదేళ్ల పాటు హైదరాబాద్‌ను అడ్డగోలుగా దోచుకుంటే.. అప్పుడు బీజేపీ వాళ్లు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఔటర్ రింగు రోడ్డు వెలుపల, లోపల ప్రభుత్వ భూములను బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టినప్పుడు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎక్కడ ఉన్నాడని నిలదీశారు. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలతో బీజేపీ, బీఆర్‌ఎ్‌సలు ఒకటేనని మరోసారి తేలిపోయిందన్నారు. అంతకుముందు రోశయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మహేశ్ గౌడ్ నివాళులర్పించారు.