Mahesh Goud Criticizes BJP: ఓట్ల చోరీ మాని.. చేతనైతే అభివృద్ధి చేయండి
ABN , Publish Date - Nov 18 , 2025 | 05:42 AM
ఓట్ల దొంగతనం వల్లే బిహార్‌లో ఎన్డీయే గెలిచిందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఎన్డీయే కంటే మహాగఠ్‌బంధన్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయని, అయినా ఎన్డీయేనే గెలవడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగా అక్కడ ఎన్నికలు జరిగుంటే మహాగఠ్‌బంధన్‌కు 200 సీట్లు వచ్చుండేవన్నారు.....
బీజేపీ నేతలకు మహేశ్ గౌడ్ హితవు
ఈసీ నోరు మెదపట్లేదేం?: పొన్నం
ఓట్ చోరీపై యూత్ కాంగ్రెస్ నిరసన
హైదరాబాద్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఓట్ల దొంగతనం వల్లే బిహార్‌లో ఎన్డీయే గెలిచిందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఎన్డీయే కంటే మహాగఠ్‌బంధన్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయని, అయినా ఎన్డీయేనే గెలవడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగా అక్కడ ఎన్నికలు జరిగుంటే మహాగఠ్‌బంధన్‌కు 200 సీట్లు వచ్చుండేవన్నారు. కేంద్రం ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుబంధ సంఘంలా మారిందని మండిపడ్డారు. బీజేపీ నేతలు ఓట్ల దొంగతనం మానుకోవాలని, చేతనైతే దేశాన్ని అభివృద్ది చేసి చూపాలని హితవు పలికారు. ‘సర్’ పేరిట బిహార్‌లో సెక్యులర్ ఓట్లను తొలగించారని ఆరోపించారు. భవిష్యత్తులో తెలంగాణలోనూ సర్ పేరిట సెక్యులర్ ఓట్లను తొలగించే ప్రమాదం ఉందని, కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా సోమవారం గాంధీభవన్‌లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహా నిరసన కార్యక్రమం జరిగింది. ఇందులో మంత్రి పొన్నం ప్రభాకర్, యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ.. ఓట్ చోరీపై ప్రజలను చైతన్యపరుస్తూ రాహుల్ గాంధీ ఎనలేని పోరాటం చేశారన్నారు. అధికారమే పరమావధిగా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా ఓట్ చోరీకి పాల్పడ్డారని విమర్శించారు. మంగళవారం నుంచి ఓట్ చోరీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ ఉధృతం చేయనున్నట్లు చెప్పారు. ఒక వ్యక్తి కోసమో తాత్కాలిక లబ్ధి కోసమో ఇలా ఓట్ చోరీ చేస్తే దేశానికే నష్టం జరుగుతుందన్నారు. యువత దీన్ని అర్థం చేసుకోవాలని కోరారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఓట్ చోరీని రాహుల్ ఆధారాలతో సహా బయటపెట్టినా.. ఈసీ ఎందుకు నోరు మెదపట్లేదని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో యూత్ కాంగ్రెస్ నాయకులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉదయ్‌భాను చిబ్ మాట్లాడుతూ మోదీ సర్కారు.. ఈసీతో కుమ్మక్కై ప్రజల ఓట్లను హరించడం సిగ్గుచేటన్నారు. అ. ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని నాంపల్లి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు.
సంపత్ లేవనెత్తిన అంశాన్ని పరిశీలిస్తాం..
కాంగ్రె్‌సలో అక్కడడక్కడా కలుపు, గంజాయి మొక్కలున్నాయని, వాటిని ఏరిపారేయాలంటూ సంపత్ చేసిన వ్యాఖ్యలపై మహేశ్ గౌడ్ స్పందించారు. కలుపు, గంజాయి మొక్కలు ఎవరన్నది సంపత్ పేర్లు ఇస్తే పరిశీలన చేస్తామని చెప్పారు. పాత నేతలకు ప్రాధాన్యం, అవకాశాలిస్తూనే కొత్త నేతలనూ కలుపుకుపోతామని చెప్పారు. డీసీసీ అధ్యక్షుల ఏ క్షణమైనా ప్రకటించవచ్చని తెలిపారు.