TPCC Chief Mahesh Goud: కిషన్‌రెడ్డి తల్చుకుంటే.. బీసీ రిజర్వేషన్లకు ఒక్కరోజులో ఆమోదం
ABN , Publish Date - Sep 26 , 2025 | 07:30 AM
బీసీ బిల్లులపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని, రాజకీయ దురుద్దేశంతోనే కేంద్రంలో తాత్సారం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు.
కానీ ఆయనకు తెలంగాణపై ప్రేమ లేదు
రాజకీయ దురుద్దేశంతోనే కేంద్రంలో తాత్సారం
కాళేశ్వరం పై 48 గంటల్లో చర్యలన్న కిషన్‌రెడ్డి ఎక్కడ?
కేటీఆర్‌కు జైలు ఖాయం.. అవినీతిపై ఆధారాలన్నీ ఉన్నాయి
కవితది రాజకీయ ఆత్మహత్య..కేసీఆర్ డ్రామాలో బలిపశువు
గెలుపు గుర్రానికే జూబ్లీహిల్స్ టికెట్:మహేశ్‌గౌడ్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): బీసీ బిల్లులపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని, రాజకీయ దురుద్దేశంతోనే కేంద్రంలో తాత్సారం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తలుచుకుంటే ఒక్కరోజులోనే కేంద్రంలో బీసీ బిల్లులకు ఆమోదం లభిస్తుందని.. కానీ కిషన్‌రెడ్డికి తెలంగాణ ప్రజలన్నా, బీసీలన్నా నచ్చరని ఆరోపించారు. రాష్ట్రంలో 42శాతం బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామన్నారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మహేశ్‌గౌడ్ మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ‘‘కాళేశ్వరం అవినీతిని వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని.. కేంద్రానికి అప్పగిస్తే 48గంటల్లో చర్యలు తీసుకుంటామని, తామెంటో చూపిస్తామని కిషన్‌రెడ్డి బీరాలు పలికారు. ఆయన విజ్ఞప్తి మేరకే సీబీఐకి అప్పగించాం. ఏమైంది? కిషన్‌రెడ్డి ఎక్కడ? చర్యలు తీసుకోవడానికి కేంద్రం ఎందుకు తాత్సారం చేస్తోంది?’’ అని ప్రశ్నించారు. ఇక ఫార్ములా-ఈ రేసు అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని, కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయమని మహేశ్‌గౌడ్ చెప్పారు. కవితది రాజకీయ ఆత్మహత్య అని, కేసీఆర్ డ్రామాలో ఆమె బలిపశువని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి, తాను జాగ్రత్తపడటం వల్లే ఈసారి అధికారంలోకి వచ్చామన్నారు. బీఆర్‌ఎస్ తీరుతో తెలంగాణ ఆర్థికంగా చితికిపోయిందని, ఆ బరువు మోయలేక ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు బీపీ, షుగర్ వచ్చాయని వ్యాఖ్యానించారు.
గెలుపు గుర్రానికే జూబ్లీహిల్స్ సీటు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు గుర్రానికే సీటు ఇస్తామని మహేశ్‌గౌడ్ తెలిపారు. ఆ నియోజకవర్గానికి చెందిన నవీన్ యాదవ్, సీఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్, బొంతు రామ్మోహన్, అంజన్‌కుమార్ యాదవ్‌తోపాటు మరో ఇద్దరు పోటీపడుతున్నారని చెప్పారు. ముగ్గురు మంత్రుల కమిటీ జూబ్లీహిల్స్‌లో సర్వే చేస్తోందని, ఆ కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థి ఎంపిక ఉంటుందని తెలిపారు. రాజగోపాల్‌రెడ్డి అంశాన్ని అధిష్ఠానం పరిశీలిస్తోందని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అంశం ప్రభుత్వ గౌరవానికి సంబంధించిన అంశమని చెప్పారు. ప్రొటోకాల్ అంశాన్ని సీరియ్‌సగా తీసుకోవాలని.. డీపీఆర్వోతోపాటు కలెక్టర్‌పైనా చర్యలు తీసుకోవాలని సీఎంను కోరానని వెల్లడించారు.
4న తెలంగాణకు ఏఐసీసీ పరిశీలకులు
డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం కాంగ్రెస్ అధిష్ఠానం నియమించిన ఏఐసీసీ పరిశీలకులు అక్టోబరు 4 నుంచి తెలంగాణలో పర్యటిస్తారని మహేశ్‌గౌడ్ తెలిపారు. ఆయా జిల్లాల్లోని మండల స్థాయి పార్టీ నేతలతో చర్చిస్తారని, జర్నలిస్టులు, ఇతర వర్గాల అభిప్రాయాలు ేసకరిస్తారని వెల్లడించారు. అనంతరం సమగ్ర వివరాలతో అధిష్ఠానానికి నివేదిక ఇస్తారని చెప్పారు. ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ పరిశీలకుల సమావేశం జరిగింది. అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మహేశ్‌గౌడ్ అందులో పాల్గొన్నారు.