PCC chief Mahesh Goud: త్వరలో పునర్‌వ్యవస్థీకరణ
ABN , Publish Date - Dec 15 , 2025 | 04:34 AM
త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించే అవకాశం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, సురేఖలను తొలగిస్తారంటూ....
మంత్రివర్గం నుంచి పొన్నం, సురేఖను తప్పిస్తారనే వార్తల్లో వాస్తవం లేదు
నెల రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిటీలు
బీఆర్‌ఎ్‌సది ముగిసిన కథ.. కవితతో ఆ పార్టీకి కొలుకోలేని దెబ్బ
ఢిల్లీలో మీడియాతో మహేశ్ గౌడ్ ఇష్టాగోష్ఠి
న్యూఢిల్లీ, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించే అవకాశం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, సురేఖలను తొలగిస్తారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఆ ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులని, పార్టీ కోసం కష్టపడినవాళ్లు అని కితాబిచ్చారు. అయితే శాఖలు మారుస్తారా? మంత్రివర్గంలో మార్పులుంటాయా? అన్న విషయాల్లో తనకు స్పష్టతలేదన్నారు. తాను క్యాబినెట్‌లోకి వెళతాననే విషయంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తనను మంత్రివర్గంలోకి ఆహ్వానించారని, స్వయంగా కేసీ వేణుగోపాల్ తనతో మాట్లాడారని, తనకు ఆసక్తిలేదని చెప్పానని వివరించారు. పార్టీ కోసం పనిచేయడంలోనే తనకు సంతృప్తి ఉందన్నారు. నెలరోజుల్లోనే వర్కింగ్ ప్రెసిడెంట్లు, కాంగ్రెస్ అనుబంధ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిటీల నియామకం ఉంటుందని వెల్లడించారు. తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం చివరిదశకు చేరింద న్నారు. ఆదివారంఢిల్లీలోని తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఉప్పల్‌లో మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమమని, ప్రపంచదేశాల దృష్టి తెలంగాణ మీద పడుతుందనే ఉద్దేశంతోనే ఈవెంట్‌కు ప్రభుత్వం సహకరించిందని తెలిపారు. నెహ్రూపై పార్లమెంట్‌లో మోదీ వ్యాఖ్యలు సరికాదన్నారు. ప్రియాంక గాంధీ అద్భుతంగా మాట్లాడారని కితాబిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలు సమర్థులను పక్కనబెట్టి వేరేవాళ్లకు అవకాశం కల్పించినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ కారణంగా అభ్యర్థుల ఓట్లు చీలడంతో మూడో స్థానానికి పరిమితం కావాల్సిన బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారన్నారు. సీఎం రేవంత్ విజనరీ లీడర్ అని, ప్రపంచ స్థాయిలో ఫోర్త్ సిటీని నిర్మిస్తున్నామని తెలిపారు. అంచనాలకు మించి గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైందని, రాజకీయ ప్రాధాన్యం ఉండొద్దనే మంత్రులను ేస్టజీ మీదకు ఆహ్వానించలేదన్నారు. తెలంగాణలో మళ్లీ అధికారం కాంగ్రె్‌సదేనని, బీఆర్‌ఎస్ కథ ముగిసిందని, కవిత దెబ్బతో ఆ పార్టీ కొలుకునే పరిస్థితుల్లో లేదన్నారు. హరీశ్, సమయం కోసం వేచి చూస్తున్నారని, వెన్నుపోటు ఖాయమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో బీజేపీ లేదని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆ పార్టీ డిపాజిట్ గల్లంతైందన్నారు. ఆ పార్టీకి 70-80 నియోజకవర్గాల్లో క్యాడరేలేదన్నారు.