Share News

Mahesh Goud Comments: అది మా కుటుంబ సమస్య

ABN , Publish Date - Oct 13 , 2025 | 04:50 AM

మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, కొండా సురేఖ, సీతక్క మధ్య వివాదం తమ కుటుంబ సమస్య అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు......

Mahesh Goud Comments: అది  మా  కుటుంబ సమస్య

  • చిన్న చిన్న పంచాయితీలుంటాయి సీతక్క, సురేఖ నాతో మాట్లాడారు సీఎంతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తా పొంగులేటి వివాదంపై

  • టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ వ్యాఖ్యలు బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంది అందుకే సుప్రీం తలుపు తడుతున్నాం ఆర్టీఐ చట్టానికి తూట్లు పొడిచిన

  • బీజేపీ: మహేశ్‌గౌడ్‌

  • నేనెవరిపైనా ఫిర్యాదు చేయలే: సీతక్క అధిష్ఠానం మందలించలేదు: కొండా

హైదరాబాద్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, కొండా సురేఖ, సీతక్క మధ్య వివాదం తమ కుటుంబ సమస్య అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. కుటుంబం అన్నప్పుడు అన్నాచెల్లెళ్ల మధ్య చిన్న చిన్న పంచాయితీలు ఉంటాయని, ఈ విషయంపై మంత్రులు కొండా సురేఖ, సీతక్క తనతో మాట్లాడారని చెప్పారు. అయితే వారు ఫిర్యాదు చేసినట్లుగా కాకుండా.. అక్కడున్న సమాచారాన్ని మాత్రమే ఇచ్చారని తెలిపారు. దీనిపై తాను, సీఎం రేవంత్‌రెడ్డి కూర్చుని మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుందని, అధిష్ఠానానికి ఎవరైనా లేఖలు రాసే స్వేచ్చ ఉంటుందని చెప్పారు. సామాన్యుడి దగ్గర్నుంచి మంత్రుల వరకు ఎవరైనా వెళ్లి అర్జీలు పెట్టుకోవచ్చన్నారు. ఇక స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ పట్ల కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని పీసీసీ చీఫ్‌ అన్నారు. అందుకే జీవో 9పై హైకోర్టు ఇచ్చిన స్టే మీద సుప్రీంకోర్టు తలుపు తడుతున్నామని చెప్పారు. ప్రతిపక్షాల కుట్రలు, కుతంత్రాలకు భయపడేది లేదని, బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. పాత రిజర్వేషన్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నా.. నిర్వహించడం లేదని, బీసీలకు 42 శాతం రిజర్వేషనే తమకు ప్రాధాన్య అంశమని వెల్లడించారు. ఏడాది కిందట జరగాల్సిన ఎన్నికలను.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకే ఆపామని చెప్పారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌.. బీసీ వ్యతిరేక పార్టీలు అని, బీసీల నోటికాడికి వచ్చిన కూడును కాలదన్నుతున్నాయని ఆరోపించారు.


అడుగడుగునా అడ్డుకుంటున్న బీజేపీ..

బీసీ బిల్లులను బీజేపీ అడుగడుగునా అడ్డుకుంటోందని మహేశ్‌గౌడ్‌ అన్నారు. ఆ బిల్లులు రాష్ట్రపతి, గవర్నర్‌ వద్ద ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో బీజేపీకి చెందిన బీసీ ఎంపీలు ఈటల రాజేందర్‌, బండి సంజయ్‌, ధర్మపురి అరవింద్‌ ఏనాడైనా అడిగారా? అని నిలదీశారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీసీ సంఘాల జేఏసీ నిర్వహించనున్న బంద్‌లో తాము కూడా పాల్గొంటామన్నారు. హరియాణాలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కులవివక్ష కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారంటే.. సమాజం ఎటుపోతుందో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ ఐపీఎస్‌ కుటుంబానికి కాంగ్రెస్‌ అండగా ఉంటుందని చెప్పారు. ఇక సమాచార హక్కు(ఆర్‌టీఐ) సహా.. యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక చారిత్రక చట్టాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడిచిందని పీసీసీ చీఫ్‌ ఆరోపించారు. ఆర్టీఐ చట్టానికి 2019లో సవరణలు చేసిన బీజేపీ.. కమిషనర్ల స్వతంత్రతను బలహీనపరిచిందన్నారు. బీజేపీ ప్రభుత్వ అవినీతిని బహిర్గతం చేేస వ్యక్తులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Oct 13 , 2025 | 05:59 AM