Mahesh Goud: బీజేపీ, కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా?
ABN , Publish Date - Dec 22 , 2025 | 05:24 AM
కేంద్రంలో బీజేపీ 12 ఏళ్ల పాలన.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ సవాల్ విసిరారు.
కిషన్‌రెడ్డికి మహేశ్‌గౌడ్ సవాల్
హైదరాబాద్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో బీజేపీ 12 ఏళ్ల పాలన.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ సవాల్ విసిరారు. కేంద్రమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి కిషన్‌రెడ్డి ఏం చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ.. ఈ 12 ఏళ్లలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు కల్పించిందో చెప్పాలన్నారు. సోనియాగాంధీని ప్రశ్నించే స్థాయి కిషన్‌రెడ్డికి లేదన్నారు. బీసీ రిజర్వేషన్లు, మెట్రోరైలు మొదలుకుని కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటు వరకు తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తున్నా.. ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చే సత్తాలేని కిషన్‌రెడ్డికి సోనియాగాంధీకి లేఖ రాసే నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. రెండేళ్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆయనకు కనిపించట్లేదా అని నిలదీశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని చెప్పారు.