Share News

Congress TPCC chief Mahesh Goud: జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే..

ABN , Publish Date - Nov 02 , 2025 | 04:58 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీఆర్‌ఎ్‌సకు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. బీఆర్‌ఎ్‌సతో లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే...

Congress TPCC chief Mahesh Goud: జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే..

  • ఆ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం

  • అందుకే బీజేపీ ప్రాధాన్యం లేని అభ్యర్థిని నిలబెట్టింది

  • కేటీఆర్‌పై ఈసీ కేసు నమోదు చేయాలి: మహేశ్‌ గౌడ్‌

హైదరాబాద్‌/యూసు్‌ఫగూడ, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీఆర్‌ఎ్‌సకు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. బీఆర్‌ఎ్‌సతో లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే జూబ్లీహిల్స్‌లో బీజేపీ ప్రాధాన్యం లేని అభ్యర్థిని పోటీకి నిలబెట్టిందని ధ్వజమెత్తారు. శనివారం హైదరాబాద్‌లోని యూసు్‌ఫగూడ కాంగ్రెస్‌ తాత్కాలిక కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ-బీఆర్‌ఎస్‌ రెండు పార్టీలు ఒక్కటేనని దుయ్యబట్టారు. ఓ సినిమాలో మాదిరి కోడిని వేలాడదీసి ఆశ చూపినట్లు నిరుద్యోగులకు నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేటీఆర్‌ ఉద్యోగాల ఆశ చూపి కాలం గడిపారని మండిపడ్డారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు గెలవడానికి బీఆర్‌ఎస్‌ సహకరించిందని, బీఆర్‌ఎస్‌ రుణం తీర్చుకోవడానికి ఇప్పుడు బీజేపీ ప్రాధాన్యం లేని అభ్యర్థిని జూబ్లీహిల్స్‌లో నిలబెట్టిందని ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రతి నిర్ణయంలో కేసీఆర్‌ పాత్ర ఉందన్నారు. రాష్ట్రపతి అధ్యక్ష పదవి నుంచి మొదలుకొని ట్రిపుల్‌ తలాక్‌ వరకు కేసీఆర్‌ బీజేపీకి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. ‘కాంగ్రెస్‌ వాళ్లు ఇచ్చే రూ.5 వేలు తీసుకోండి.. బీఆర్‌ఎ్‌సకి ఓటేయండి?’ అంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్య అని, ఎలక్షన్‌ కమిషన్‌ తక్షణమే కేటీఆర్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో అధిక శాతం అమలు చేసే ఇప్పుడు ఓట్లు అడుగుతున్నామన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని.. అమాయకులైన నిరుద్యోగులను బలిగొన్న చరిత్ర బీఆర్‌ఎ్‌సదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, బీసీ రిజర్వేషన్లు కోరుకునే నాయకులు, పార్టీల ప్రతినిధులు, బీసీలంతా ఉమ్మడిగా ఢిల్లీ వెళ్లి ప్రధాని, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు సూచించారు. గాంధీభవన్‌లో వీహెచ్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్ని రోజులు శ్రమించినా ప్రయోజనం లేదన్నారు. ఇప్పుడు కాకపోతే ఇక ఎప్పటికీ బీసీ రిజర్వేషన్లు సాధ్యం కాదని చెప్పారు.

Updated Date - Nov 02 , 2025 | 04:59 AM