kumaram bheem asifabad- కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్‌కు మహర్దశ
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:16 PM
కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్ మహర్దశ కలుగ నుంది. కేంద్రప్రభుత్వం అమల్లోకి తెచ్చిన అమతృభారత్ పథకంలో కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్ ఎంపిక కావడంతో అభివృద్ధి పనులకు అడుగులు పడనున్నాయి.
- రూ.20 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
- త్వరలోనే అందుబాటులోకి రానున్న లిఫ్ట్ సౌకర్యం
కాగజ్‌నగర్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్ మహర్దశ కలుగ నుంది. కేంద్రప్రభుత్వం అమల్లోకి తెచ్చిన అమతృభారత్ పథకంలో కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్ ఎంపిక కావడంతో అభివృద్ధి పనులకు అడుగులు పడనున్నాయి. ఈ పథకం కింద రూ.20 కోట్ల నిధులు విడుదల కానున్నాయి. ఈ నిధులతో రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు ప్రారంభం కానున్నాయి. కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌కు లిఫ్ట్ సౌకర్యం, మరో రెండు షెడ్ల నిర్మాణంతో పాటు తదితర పనులు చేపట్టాల్సి ఉంది. ఇందుకు పూర్తి స్థాయిలో రైల్వేఅధికారులు సర్వేలు చేసి నివేదికలను సిద్ధం చేశారు. ప్రయాణికుల సమస్యలను పరిష్కరించడం స్టేషన్ ప్రాంతాన్ని సర్వాంగం సుందరంగా తీర్చిదిద్దడం తదితర కార్యక్రమాలకు త్వరలోనే శ్రీకారం చుట్టనున్నారు. ఈ పనులు పూర్తయితే ప్రయాణికుల కష్టాలు పూర్తిగా తొలగిపోయే అవకాశాలున్నాయి. ప్రస్తుతం భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలు నిర్ణీత సమయానికి రాక పోవడం, ఈ రైలులో నిర్వహణ సరిగ్గా లేక పోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. స్టేషన్‌లో సులభ్ కాంప్లెక్సు నిర్వహణ పూర్తి స్థాయిలో చేపట్టాల్సి ఉంది. వీటితో పాటు మూడో ప్లాట్ ఫాంకు ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పించక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
- కొత్త రైళ్ల హాల్టుతో..
కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్‌లో గత నెల 16న వందేభారత్ రైలు హాల్టు ఇవ్వడంతో ఈ ప్రాంత వాసులకు కల నెరవేరింది. ఉదయం 8 గంటల నుంచి ఇక్కడి నుంచి బయలుదేరి 12 గంటలకు సికింద్రాబాద్‌లో చేరుతుండడంతో నిత్యం ఈ రైలుకు ఇక్కడి నుంచి ప్రయాణాలు సాగిస్తున్నారు. వీటితో పాటు అక్టోబరు 14న బిహార్ నుంచి తెలంగాణలోని సికింద్రాబాద్ మధ్య నడిచే ముజాఫర్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు కూడా హాల్టు ఇచ్చారు. బిహార్‌కు వెళ్లేందుకు ప్రయాణికులకు ఇబ్బందులు తొలగిపోయాయి. ఎస్పీఎంలో పని చేస్తే సిబ్బంది, ఉద్యోగులు, కార్మికులు బిహార్ వాసులు అఽధికంగా ఉన్నారు. వీరికి ఎంతగానో ఉపయోగపడనుంది. కాగా కేరళ ఎక్స్‌ప్రెస్‌కు కూడా హాల్టు ఇవ్వాలని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు రైల్వే శాఖ మంత్రికి గత నెలలో వినతిపత్రం అందజేశారు. కేరళ ఎక్స్‌ప్రెస్‌కు హాల్టు ఇస్తే మరింత సౌకర్య వంతం కానుంది.
పనులు త్వరగా పూర్తి చేయాలి..
-పెద్దపల్లి కిషన్‌రావు, కాగజ్‌నగర్
కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి. ప్రస్తుతం లిఫ్ట్ సౌకర్యం లేక పోవడంతో వృద్ధులు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. భాగ్యనగర్ రైలు నిర్ణిత సమయానికి కాగజ్‌నగర్‌కు చేరుకునేట్టు చూడాల్సి ఉంది. రైల్వేస్టేషన్‌లో పెండింగ్ పనులు కూడా వేగంగా పూర్తి చేస్తే ప్రయాణికులు కష్టాలు తీరుతాయి. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలి.