kumaram bheem asifabad- సామాజిక ఆసుపత్రికి మహర్దశ
ABN , Publish Date - Nov 30 , 2025 | 11:02 PM
కాగజ్‌నగర్ సామాజిక ఆసుపత్రి ఇక వంద పడకల ఆసుపత్రిగా మారనుంది. ప్రస్తుతం 30 పడకలతో రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వంద పడకలకు అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పది రోజుల క్రితం ఇందుకు సంబంధించి జీవోను కూడా విడుదల చేశారు
- రూ.26 కోట్ల నిధులు విడుదల చేసిన సర్కార్
- నిరుపేదలకు అందుబాటులోకి రానున్న మెరుగైన వైద్యం
కాగజ్‌నగర్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ సామాజిక ఆసుపత్రి ఇక వంద పడకల ఆసుపత్రిగా మారనుంది. ప్రస్తుతం 30 పడకలతో రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వంద పడకలకు అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పది రోజుల క్రితం ఇందుకు సంబంధించి జీవోను కూడా విడుదల చేశారు. అలాగే రూ.26 కోట్ల నిధులను కూడా విడుదల చేసింది. ప్రధానంగా సివిల్ పనుల కోసం రూ.18 కోట్లు, మిగిలిన నిధులతో పరికరాల కొనుగోలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు ఆసుపత్రి ఆవరణలో ఉన్న పురాతన భవనాన్ని కూల్చివేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
- ఆసుపత్రి నిర్మాణం కోసం..
వంద పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం పలు చోట్ల స్థలం ఎంపిక చేసినప్పటికీ సరైన వసతులు లేమితో మళ్లీ సామాజిక ఆసుపత్రి భవనంలోనే మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిధులతో జీ+2 భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం 30 పడకల ఆసుపత్రి కొనసాగుతున్నది. ఈ భవనం నిర్మాణం పూర్తి అయితే వంద పడకల ఆసుపత్రిగా సేవలు అందించేందుకు శ్రీకారం చుడుతున్నారు. సిర్పూరు నియోజకవర్గంలోనే ఏడు మండలాలకు కీలక సేవలను అందిస్తోంది. ఈ ఆసుపత్రిలో గర్భిణులకు ప్రసవం, స్కానింగ్, నిత్యం రోగులకు వైద్యం అందిస్తున్నారు. వంద పడకలు అప్‌గ్రేడ్ అయితే గైనకాలిజస్ట్, జనరల్ ఫిజిషీయన్, ఎనస్తీయా, ఈఎన్‌టీ సర్జన్, ఎంబీబీఎస్ డాక్టర్‌ల పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు. కాగజ్‌నగర్ 30 వార్డులతో పాటు సమీప మండలాల ప్రజలు ఇక్కడే వైద్యం తీసుకుంటున్నారు. రోజు రోజుకు రోగుల సంఖ్య క్రమేణా పెరుగుతుండడంతో వైద్య సేవలు మరింత ఆధునీకరణ పరికరాలతో సేవలు అందించనున్నారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో మలేరియా, సీబీపీ, వైడల్ టెస్టులు చేస్తున్నారు. మిగితా టెస్టులు జిల్లా కేంద్రానికి పంపిస్తున్నారు. వంద పడుకలు ఆసుపత్రి నిర్మాణం జరిగితే అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి రానుండడంతో అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వంద పడుకల ఆసుపత్రి నిర్మాణం పనులు త్వరితగిన పూర్తి చేసి ఈ ప్రాంత వాసులకు వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేట్టు చూడాలని ప్రజలు కోరుతున్నారు.
నిధుల మంజూరు అభినందనీయం..
-సూర్య ప్రకాష్, కాగజ్‌నగర్
వంద పడుకల ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు రూ.26 కోట్లు విడుదల చేయడం అభినందనీయం. ఆసుపత్రిలోని సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలి. కొత్త ఆసుపత్రి నిర్మాణం కూడా త్వరితగతిన పూర్తి జరిగేట్టు జిల్లా అధికారులు పర్యవేక్షణ చేపట్టాలి. పనులు పూర్తి జరిగితే వైద్య సౌకర్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అధికారులు, నాయకులు దృష్టి సారించాలి.
ప్రజలకు అందుబాటులోకి వైద్యం..
- హరీష్‌బాబు, సిర్పూరు ఎమ్మెల్యే,
ప్రజలకు వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వంద పడుకల ఆసుపత్రికి నిధుల కోసం సీఎం రేవంత్‌రెడ్డతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లాం. రూ.26 కోట్ల నిధులు విడుదల కావడం హర్షణీయం. ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తి జరిగితే గైనకాలిజస్ట్, అనస్తషియా, ఈన్‌టీ, ఎంబీబీఎస్ వైద్యులతో సేవలు అందనున్నాయి.