Magisterial Inquiry: హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మెజిస్టీరియల్ విచారణ
ABN , Publish Date - Dec 16 , 2025 | 04:18 AM
ఇటీవల మారేడుమిల్లి మండలంలో రెండురోజులపాటు జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో హిడ్మా, టెక్ శంకర్‌తో కలిపి 13మంది మావోయిస్టుల మృతి చెందిన ఘటనలపై అల్లూరి జిల్లా రంపచోడవరం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో.....
హిడ్మా బంధువులు హాజరు
ప్రజావిచారణను గోప్యంగా పోలీసు పహారాతో నిర్వహిస్తున్నారు
ప్రజా న్యాయవాదుల సంఘం
రంపచోడవరం, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): ఇటీవల మారేడుమిల్లి మండలంలో రెండురోజులపాటు జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో హిడ్మా, టెక్ శంకర్‌తో కలిపి 13మంది మావోయిస్టుల మృతి చెందిన ఘటనలపై అల్లూరి జిల్లా రంపచోడవరం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మొదటిరోజు మెజిస్టీరియల్ విచారణ జరిగింది. ఈ తొలి రోజు విచారణను నవంబరు 18న మారేడుమిల్లి మండలం కొండవాడ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో జరిగిన మావోయిస్టు అగ్రనేత మడివి హిడ్మా, ఆయన సతీమణి రాజే మడకామితో సహా ఆరుగురు మావోయిస్టుల మృతిపై రంపచోడవరం సబ్‌కలెక్టర్ శుభం నొఖ్వాల్ విచారణ నిర్వహించారు. దీనికి హిడ్మా బంధువులతోపాటు మరికొందరు హాజరైనట్టు సమాచారం. ఎవరెవరు ఈ విచారణకు హాజరయ్యారన్న విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. కాగా ఈ ప్రజా విచారణకు మీడియాను దూరంగా ఉంచి గోప్యంగా నిర్వహించారని, ప్రజలు స్వేచ్ఛగా వచ్చి విచారణకు హాజరై తమ అభిప్రాయాలను నిర్భయంగా వెలిబుచ్చే అవకాశాన్ని లేకుండా పోలీసుల ఆంక్షలు అమలు చేస్తున్నారని ప్రజాన్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సురే్‌షకుమార్ ఆరోపించారు. ఈ విచారణను పత్రికల్లో చూసి తాను హాజరయ్యానని, తనను కూడా అనుమతించడానికి పోలీసులు ఆటంకం కలిగించారని అన్నారు. ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయన్ను విచారణాధికారి ముందుకు అనుమతించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ విచారణ సక్రమంగా జరగడం లేదని, పోలీసులు ఎందుకు ఈ విచారణకు చట్టవిరుద్ధంగా ఆంక్షలు విధిస్తున్నారని, ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా ఎవరూ చెప్పకుండా వారు అడ్డుకుంటూ, తమకు అనుకూలంగా చెప్పేవారినే వారు తీసుకువస్తున్నారని ఆరోపించారు. ఎన్‌కౌంటర్లు జరిగిన ప్రాంతాలను పరిశీలించి నిజాలను నిర్ధారించేందుకు వెళ్లిన న్యాయవాదులను, విద్యార్థులను కూడా పోలీసులు అడ్డుకుంటున్నారని విచారణాధికారికి వివరించామని తెలిపారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకుని వివరించేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా విచారణాధికారి అంగీకరించి మరో పదిరోజుల తర్వాత మరో తేదీని ఖరారు చేసి విచారణ కొనసాగిస్తామన్నారని స్పష్టం చేశారు.
నేడు మరో ఏడుగురు మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై విచారణ
అల్లూరి జిల్లా మారేడుమిల్లి మండలం జీఎం వలస సమీపంలో గతనెల 19న జరిగిన టెక్ శంకర్ సహా ఏడుగురి మావోయిస్టుల ఎన్‌కౌంటర్ మరణాలపై మెజిస్టీరియల్ విచారణ రంపచోడవరం సబ్ కలెక్టరు కార్యాలయంలో మంగళవారం జరగనుంది. ఇప్పటికే ఈ విచారణపై విచారణాధికారి శుభం నొక్వాల్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. సోమవారం హిడ్మా తదితరుల మరణాలపై విచారణ జరగ్గా మంగళవారం ఏడుగురి మరణాలపై విచారణ జరగనుంది.