Share News

Artificial Intelligence: పాటలు పాడి, గుసగుసలాడే ఏఐ..లూనా

ABN , Publish Date - Oct 31 , 2025 | 03:26 AM

జైపూర్‌ కేంద్రంగా పని చేసే పిక్సా ఏఐ అనే స్టార్టప్‌ కంపెనీ వ్యవస్థాపకుడైన స్పర్ష్‌ అగర్వాల్‌ అనే 25 ఏళ్ల యువకుడు కృత్రిమ మేధ..

Artificial Intelligence: పాటలు పాడి, గుసగుసలాడే ఏఐ..లూనా

  • భారత్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడి ఆవిష్కరణ

జైపూర్‌, అక్టోబరు 30: జైపూర్‌ కేంద్రంగా పని చేసే పిక్సా ఏఐ అనే స్టార్టప్‌ కంపెనీ వ్యవస్థాపకుడైన స్పర్ష్‌ అగర్వాల్‌ అనే 25 ఏళ్ల యువకుడు కృత్రిమ మేధ(ఏఐ)కి సంబంధించి అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. ప్రపంచంలోనే తొలి స్పీచ్‌ టు స్పీచ్‌ ఏఐ మోడల్‌.. అంటే మనుషుల మాటలు విని తిరిగి మాటల రూపంలోనే బదులిచ్చే ఏఐని అభివృద్ధి చేసి అందుబాటులోకి తెచ్చారు. ‘లూనా’ అనే పేరు కలిగిన ఈ ఏఐ మోడల్‌.. మనిషి మాట్లాడే మాటలకు అచ్చం మనిషిలానే స్పందించి మాటలతోనే బదులిస్తుంది. లూనా గుసగుసలాడుతుంది, కబుర్లు చెబుతుంది, మాట్లాడే విషయానికి అనుగుణంగా తన గొంతు సవరించుకుంటుంది.. అంతేనా సొంతంగా పాటలు కూడా పాడుతుంది. సరిగ్గా చెప్పాలంటే ఏఐతో కాదు ఓ మనిషితోనే మాట్లాడుతున్నామనేలా పని చేస్తుంది. ఐఐటీ భువనేశ్వర్‌ పట్టభద్రుడైన స్పర్ష్‌ అగర్వాల్‌.. పెద్దగా సాంకేతిక మౌలిక సదుపాయాలు, లక్షల కోట్ల పెట్టుబడులు లేకుండానే ఈ ఆవిష్కరణ చేశారు. జీపీయూ(గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌)లు, క్లౌడ్‌ క్రెడిట్‌లు అద్దెకు తీసుకొని, క్రెడిట్‌ కార్డు ద్వారా అప్పులు చేసి స్పర్ష్‌ లూనాను అభివృద్ధి చేశారు. స్పర్ష్‌ బృందంలో నితీశ్‌ కార్తీక్‌, అపూర్వ్‌ సింగ్‌, ప్రత్యూష్‌ కుమార్‌ సభ్యులు కాగా మరో ముగ్గురు ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించారు. ఎక్స్‌ వేదికగా బుధవారం(అక్టోబరు 29న) లూనాను ప్రపంచానికి పరిచయం చేసిన స్పర్ష్‌.. లూనా సామర్థ్యాన్ని తెలిపే ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. భావోద్వేగాలను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా పని చేసే ఏఐ మోడళ్ల అభివృద్ధికి భారతదేశాన్ని కేంద్రంగా మార్చడమే తన లక్ష్యమని స్పర్ష్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Updated Date - Oct 31 , 2025 | 03:26 AM