Lucky Hansika: లక్కీ హన్సిక!
ABN , Publish Date - Nov 03 , 2025 | 03:58 AM
సొంతి ల్లు లేని ఓ చిరుద్యోగి కుటుంబానికి లక్కీ డ్రాలో అదృష్టం వరించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో నిర్వహించిన లక్కీ డ్రాలో ...
500కే రూ.16లక్షల విలువైన ఇల్లు
లక్కీడ్రా పద్ధతిలో ఇంటిని విక్రయానికి పెట్టిన చౌటుప్పల్ వాసి
విజేతగా నిలిచిన చిన్నారి
చౌటుప్పల్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): సొంతి ల్లు లేని ఓ చిరుద్యోగి కుటుంబానికి లక్కీ డ్రాలో అదృష్టం వరించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో నిర్వహించిన లక్కీ డ్రాలో రూ.16 లక్షల విలువైన ఇంటిని రూ.500లకే సొం తం చేసుకుంది. కుటుంబంలో ఉన్న నలుగురి పేరిట కూపన్లు కొనుగోలు చేయగా, చిన్న కుమార్తె హన్సిక లక్కీ డ్రా గెలుచుకుంది. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన కార్పెంటర్ రామబ్రహ్మాం.. యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో 66 గజాల విస్తీర్ణంలో ఉన్న తన ఇంటిని అమ్మకానికి పెట్టాడు. అయితే, ఏడాదిగా ఇంటి కొనుగోలుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో ఓ వినూత్న ఆలోచన చేశాడు. లక్కీ డ్రా పద్ధతిలో ఇంటిని విక్రయించేందుకు నిర్ణయించుకుని, డ్రా పద్ధ్దతిలో రూ. 500లకే గెలుచుకోవచ్చంటూ విస్తృతంగా ప్రచారం చేశాడు. ఇందుకోసం 3,600 కూపన్లు ముద్రించానని, నవంబరు 2న లక్కీ డ్రా తీస్తానని ప్రకటించాడు. ఇచ్చిన మాట మేరకు ఆదివారం రోజున కూపన్లు కొనుగోలు చేసిన దాదాపు 300మంది సమక్షంలో డ్రా తీశాడు. చౌటుప్పల్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో లక్కీ డ్రా నిర్వహించగా.. సంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లికి చెందిన చిన్నారి హన్సిక కూపన్ గెలుచుకుంది. చిన్నారి తండ్రి శంకర్‌కు రామబ్రహ్మం ఫోన్ చేసి సమాచారాన్ని అందించాడు. త్వరలోనే ఇంటిని రిజిస్ట్రేషన్ చేయిస్తానని తెలిపాడు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. కుమార్తెపేరిట ఇల్లు దక్కటం అదృష్టంగా భావిస్తున్నానంటూ సంతోషం వ్యక్తం చేశాడు.