kumaram bheem asifabad- లక్కు .. కిక్కు .. ఎవరికో..?
ABN , Publish Date - Oct 25 , 2025 | 10:23 PM
జిల్లాలో మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఉత్కంఠ నెలకొంది. కిక్కు, లక్కు తమను వరిస్తుందా లేదా అని సోమవారం తీసే లాటరీపై గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ ముగియడంతో టెండర్ దారుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈసారి లక్ష్మి కటాక్షం ఎవరిని వరించబోతుందోనన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తొంది.
- జిల్లాలో 32 దుకాణాలకు 680 దరఖాస్తులు
ఆసిఫాబాద్‌రూరల్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఉత్కంఠ నెలకొంది. కిక్కు, లక్కు తమను వరిస్తుందా లేదా అని సోమవారం తీసే లాటరీపై గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ ముగియడంతో టెండర్ దారుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈసారి లక్ష్మి కటాక్షం ఎవరిని వరించబోతుందోనన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తొంది. కొత్తగా టెండర్ వేసిన వారు మొదటి అవకాశంపై ఆశలు పెట్టుకుంటున్నారు. డ్రాను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎక్సైజ్‌శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో ఎక్సైజ్‌శాఖ అంచనాలు తలకిందులయ్యాయి. గత సీజన్‌లో భారీ పోటీ, ఆధిక దరఖాస్తులతో జిల్లాలో టెండర్లు రికార్డు స్థాయిలో నమోద య్యాయి. 32 మద్యం దుకాణాలకు 1,020 దరఖాస్తులు, రూ. 2 లక్షల(నాన్ రీఫండబుల్ ఫండ్) ద్వారా సుమారు రూ. 20 కోట్ల మేర ఆదాయం సమకూరింది. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. దరఖాస్తు ఫీజు రూ. 3 లక్షలకు పెంచడంతో టెండర్ దారులు నిరాశకు గురయ్యారు. దీంతో జిల్లాలోని 32 మద్యం దుకాణాలకు 680 టెండర్లు దాఖలయ్యాయి.
రూ. 3లక్షల డిపాజిట్..
టెండర్ల ప్రక్రియలో పాల్గొనే వ్యాపారులు ప్రతీ దరఖాస్తుకు రూ. 3 లక్షల నాన్ రీఫండబుల్ డిపాజిట్ చెల్లించాలి. లక్కు తగలకపోతే ఆ మొత్తం తిరిగి రాదు. ఈ కారణంగా చాలా మంది కొత్తగా వ్యాపారం ప్రారంబించాలనుకున్న వారు వెనుకడుగు వేశారు. గతంలో పదుల సంఖ్యలో దరఖాస్తులు వేసి లక్కు తగలకపోయినా అనుభవం ఉన్న వ్యాపారులు ఈసారి దూరంగా ఉన్నారు. అలాగే రెండేళ్లుగా మద్యం అమ్మకాలపై కట్టుదిట్టమైన నియంత్రణలు, ధరల పెరుగుదల, కొత్త లైసెన్సింగ్ నిబంధనలు వ్యాపార లాభాలను తగ్గించాయి. ఇక సేల్స్ తగ్గిపోవడంతో లాభదాయకతపై అనుమానాలు పెరిగాయి. మునుపటి సీజన్‌లా విక్రయాలు జరుగవని ముందుగానే అంచనా వేసి చాలా మంది ఈసారి దరఖాస్తు చేయలేదని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాలోని 32 మద్యం దుకాణాలకు 680 దరఖాస్తులు వచ్చాయి. ఆసిఫాబాద్ డివిజన్‌లోని 16 మద్యం దుకాలణాలకు 349, కాగజ్‌నగర్ డివిజన్‌లోని 16 మద్యం దుకాణాలకు 331 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా కాగజ్‌నగర్ డివిజన్‌లోని గూడెం షాప్‌కు 67 దరఖాస్తులు రాగ, అత్యల్పంగా ఆసిఫాబాద్ డివిజన్‌లోని గోలేటి షాప్‌కు మూడు దరఖాస్తులు వచ్చాయి. సోమవారం సమీకృత కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మద్యం దుకాణాలకు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. డిసెంబరు 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలులోకి రానుంది. జిల్లా పరిధిలో 32 మద్యం దుకాణాలకు ఈ నెల 27న లక్కీడ్రా ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా ఎక్సైజ్ అధికారి జ్యోతికిరణ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 26 నుంచి ఈ నెల 23 వరకు 32 దుకాణాలకు గాను మొత్తం 680 దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. లక్కీడ్రాను కార్యాలయం సముదాయంలో నిఇర్వహించడం జరుగుతుందని టెండరు దారులు సకాలంలో హాజరు కావాలని కోరారు.