L&T Proposes Exit From Hyderabad Metro: మెట్రో రైల్ నుంచి ఎల్ టీ ఔట్..?
ABN , Publish Date - Sep 18 , 2025 | 05:42 AM
మెట్రో రైల్ ప్రాజెక్టు నుంచి వైదొలుగుతాం.. రూ.6వేల కోట్లు ఇస్తే వెళ్లిపోతాం’’ అని ఇటీవల ఎల్ అండ్ టీ సంస్థ రాసిన లేఖపై ప్రభుత్వం లోతుగా ఆలోచిస్తోంది...
వెళ్లిపోతానంటే ప్రభుత్వమే తీసుకునే యోచన
రూ.6 వేల కోట్లు ఇస్తే గుడ్‌బై చెబుతామంటూ ఎల్ అండ్ టీ లేఖ
మెట్రో 2వ దశకు ఎల్ అండ్ టీ సహకరం లేకపోవడంపై సర్కారు అసంతృప్తి
మొదటి దశ ఆస్తుల నిర్వహణ విషయంలోనూ అభ్యంతరాలు
హైదరాబాద్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ‘‘మెట్రో రైల్ ప్రాజెక్టు నుంచి వైదొలుగుతాం.. రూ.6వేల కోట్లు ఇస్తే వెళ్లిపోతాం’’ అని ఇటీవల ఎల్ అండ్ టీ సంస్థ రాసిన లేఖపై ప్రభుత్వం లోతుగా ఆలోచిస్తోంది. పదే పదే అదే పాట పాడితే.. వెళ్లిపోతానని అంటే.. సరే అనడానికి సిద్ధమైనట్టు విశ్వసనీయ సమాచారం. మెట్రో రెండో దశ ప్రాజెక్టును ఎలాగూ ప్రభుత్వమే నిర్మించి నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో.. మొదటి దశను కూడా నిర్వహించేందుకు అవసరమైతే సిద్ధంగా ఉండాలన్న చర్చ ప్రభుత్వంలో నడుస్తోంది. త మకు అప్పులు, వడ్డీల భారం ఎక్కువగా ఉందని ఎల్ అండ్ టీ సంస్థ చెబుతుండగా.. తొలి దశలో ఆ సంస్థకు ఇచ్చిన ఆస్తుల నిర్వహణ సమర్థంగా లేదన్న అభిప్రాయం ప్రభుత్వంలో ఉంది. మెట్రో నిర్వహణ తమకు లాభదాయకంగా లేదని ఎల్ అండ్ టీ సంస్థ అంతర్గతంగా పలుమార్లు చెప్తోంది. అంతర్గతంగా లేఖలు రాస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎల్ అండ్ టీ పెట్టిన ప్రతిపాదనను తీవ్రంగానే పరిగణిస్తోందని సమాచారం.
రెండో దశ కింద మొదటి విడతలో రూ.24,259 కోట్లు, మలి విడతలో రూ.19,450 కోట్లతో మెట్రో విస్తరణను ప్రభుత్వమే చేపడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. హెచ్‌ఎండీఏ పరిధిలోని నలు మూలలనూ మెట్రోతో కనెక్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంత భారీ విస్తరణ చేయడానికి సిద్ధమైన తరుణంలో.. మొదటి విడత మెట్రో నిర్వహణ బాధ్యతను కూడా తీసుకోవడం వల్ల ఇబ్బంది ఏమీ ఉండదన్న భావన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే తమంత తాముగా ఆ ప్రతిపాదన పెట్టబోమని.. ఎల్ అండ్ టీ అంటే మాత్రం దానికి పచ్చజెండా ఊపేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం.
మొదటి దశకు, రెండో దశ కింద చేపట్టనున్న మెట్రో ప్రాజెక్టుకు మధ్య అనుసంధానం, సమన్వయం అన్నీ బాగుండాలంటే.. మొత్తం నిర్వహణ ఒకే గొడుగు కింద ఉంటే బాగుంటుందా? అన్న చర్చ కూడా ప్రభుత్వంలో అంతర్గతంగా జరిగిందని తెలిసింది. చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలే మెట్రోను నిర్వహిస్తున్నందున.. రాష్ట్రంలో కూడా అదే తరహాలో చేయవచ్చనే ఆలోచన ఉంది. దీనికోసం అవసరమైతే ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి ముందుకెళ్లాలన్న ఆలోచనా ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. నిధుల సమీకరణకు ఈ పని ఉపకరిస్తుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆధీనంలోనే..
మెట్రో రైల్వే నిర్వహణకు సంబంధించి హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, కొచ్చి, లఖ్‌నవూ, నాగపూర్, పుణే, అహ్మదాబాద్‌లో నడుస్తున్నాయి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపట్టారు. వాటి నిర్వహణకు ప్రత్యేక కార్పొరేషన్లు (ఎస్‌పీవీ) ఏర్పాటు చేశారు. వీటిలో అత్యధికం లాభాల బాటలో నడుస్తున్నాయి. మరికొన్ని నష్టాల్లో నడుస్తున్నట్లు వారి ఆదాయ వ్యయాలను బట్టి తెలుస్తోంది. అయినప్పటికీ అక్కడి ప్రభుత్వాలు ఆ నష్టాలను భారంగా చూడట్లేదు. వాణిజ్యపరంగా చూడకుండా ప్రజారవాణా కోణంలో చూస్తున్నాయి. కొవిడ్ సమయంలో హైదరాబాద్ మెట్రోకే కాకుండా అన్ని మెట్రోలకూ నష్టాలు వచ్చాయి.
2023-24 ఆర్థిక సంవత్సరంలో నమ్మ మెట్రో( బెంగళూరు) లాభాల్లో నడిచినట్లు గణాంకాలు విడుదల చేసింది. అదే ఏడాది కొచ్చి మెట్రో కూడా ఆపరేటింగ్ లాభాన్ని చూపింది. హైదరాబాద్ మెట్రోను పీపీపీ మోడల్‌లో ఏర్పాటు చేయడమే కాకుండా దానికి ప్రభుత్వ భూములు కూడా ఇచ్చారు. సుమారు 90ు నిధులను బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్నారు. భూములను సక్రమంగా సద్వినియోగం చేసుకోకపోవడమే మెట్రో ప్రస్తుత పరిస్థితికి కారణమని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో 90 శాతం స్టేషన్లకు పార్కింగ్ సౌలభ్యం లేకపోవడం కూడా ప్రాజెక్టు విజయవంతం కాకపోవడానికి మరో కారణంగా చెబుతున్నారు.