Lottery for Liquor Shop Licenses: లిక్కర్ షాపు లాటరీ తగిలితే లైఫ్ సెట్టే!
ABN , Publish Date - Nov 10 , 2025 | 03:40 AM
ఆమె ఓ సాధారణ గృహిణి. మద్యం దుకాణ లైసెన్సు కోసం రూ.3లక్షలు పెట్టి ఎక్సైజ్ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం నిర్వహించిన లాటరీలో ఆమెకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లైసెన్సు దక్కడంతో లక్ష్మీదేవి ఆమెను కటాక్షించింది.....
లాటరీలో లైసెన్సులు పొందిన వారిపై కాసుల వర్షం.. 3 లక్షల పెట్టుబడికి రూ.కోటిన్నర దాకా రాబడి
పెద్దమొత్తంలో డబ్బిచ్చి దుకాణాలు తీసుకుంటున్న బడా వ్యాపారులు
లాటరీ విధానంలో మద్యం దుకాణాల కేటాయింపు మాటున నయా దందా
చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న ఎక్సైజ్ అధికారులు
హైదరాబాద్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఆమె ఓ సాధారణ గృహిణి. మద్యం దుకాణ లైసెన్సు కోసం రూ.3లక్షలు పెట్టి ఎక్సైజ్ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం నిర్వహించిన లాటరీలో ఆమెకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లైసెన్సు దక్కడంతో లక్ష్మీదేవి ఆమెను కటాక్షించింది. ఆ గృహి ణి, ఆమె భర్తతో బేరమాడిన ఓ బడా మద్యం వ్యా పారి రూ.1.5 కోట్లకు వారి నుంచి ఆ లైసెన్సు తీసుకున్నాడు. పేరేమో ఆ గృహిణిది. వ్యాపారం ఆ బ డా వ్యాపారిదన్నమాట. రూ.3లక్షల పెట్టుబడితో ఆ గృహిణి ఒక్కసారిగా కోటీశ్వరురాలైంది. మంచిర్యాల జిల్లాలో ఏడుగురు మిత్రులు 15 దుకాణాలకు దరఖాస్తు చేస్తే.. ఆ సిండికేట్‌కు లాటరీలో 5 దుకాణా లొచ్చాయి. అందులో రెండింటిని రూ.85లక్షల చొప్పు న, మరో మూడింటిని రూ.3కోట్ల చొప్పున ఇతరులకిచ్చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ కుటుం బం 5 దరఖాస్తులు చేసుకోగా లాటరీలో 2 దుకాణాలు దక్కాయి. ఆ రెండింటిని వారు రూ.2 కోట్లకు అమ్మేశారు. రూ.15 లక్షల పెట్టుబడికి వాళ్లకు రూ.1.85 కోట్ల లాభం వచ్చినట్లైంది. ఇలా లైసెన్సును మరొకరికి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమైనా.. లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీ మాటున నయా దందా జరుగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుత మద్యం దుకాణాల రెండేళ్ల గడువు నవంబరు 30తో ముగియనుండగా.. డిసెంబరు 1 నుంచి కొత్త దుకాణాలు ప్రారంభం కానున్నాయి. కొత్త దుకాణాల లైసెన్సులకు దరఖాస్తులు ఆహ్వానించిన ఎక్సైజ్ శాఖ.. ఇటీవల లాటరీ పద్ధతిలో కేటాయింపులు కూడా చేసింది. ఖజానాకు భారీ ఆదాయం సమకూర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టు దరఖాస్తులు తీసుకుంటోంది. దరఖాస్తుదారుకు వ్యాపార అనుభవం ఉందా? లేదా? సరుకు కొనే శక్తి ఉందా? లేదా? అనే కనీస అర్హతల నూ పరిశీలించకుండా దరఖాస్తులు స్వీకరించి లాట రీ నిర్వహిస్తుంది. దరఖాస్తులు చేసుకునే వారిలో అప్పటికే మద్యం వ్యాపారం చేస్తున్న వారి కంటే.. లాటరీలో లైసెన్స్ దక్కితే దాన్ని మరొకరికిచ్చి సొమ్ము చేసుకుందామనుకునే వారు ఎక్కువయ్యా రు. రూ.3లక్షల నాన్-రిఫండబుల్ రుసుం చెల్లిస్తే చాలు.. ‘‘లాటరీ తగిలితే లైఫ్ సెట్’’ అని కొందరు దరఖాస్తు చేసేస్తున్నారు. అటువంటి వారి లో గృహిణులు, నిరుద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు అధికం. అదృష్టం కొద్దీ లైసెన్సు లభిస్తే రూ.80లక్షల నుంచి రూ.1.50 కోట్లకు మరొకరికి ఇచ్చేస్తున్నారు. రూ.కోట్లు చెల్లించి లైసెన్స్ తీసుకుంటున్నా రెండేళ్లలో అంతకు ఐదింతలు కచ్చితంగా సంపాదించుకోవచ్చని అసలైన వ్యాపారులూ కాసులు కుమ్మరిస్తున్నారు.
హైదరాబాద్‌లో అద్దెకు వందల లైసెన్సులు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్కో దుకాణాన్ని రూ.కోటి నుంచి రూ.1.50 కోట్ల చొప్పున వందల సంఖ్యలో లైసెన్స్‌లను అద్దెకిచ్చేశారు. జిల్లాలు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లోనూ ఒక్కో దుకాణం అమ్మకం స్థాయి బట్టి రూ.80వేల నుంచి రూ.కోటికి అమ్మేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఏ అనుభవం లేని వ్యక్తి తనకు దక్కిన లైసెన్సును వేరేవాళ్లకు అద్దెకు ఇచ్చినందుకు అందులో వచ్చే లాభంలో సగం వాటాతో పాటు అదనంగా తక్షణమే రూ.40 లక్షలు గుడ్‌విల్‌గా ఇచ్చేశారు. ఖమ్మం జిల్లా లో ఓ ప్రైవేటు ఎరువుల దుకాణంలో గుమస్తా రూ.3లక్షలు అప్పుచేసి దరఖాస్తు చేసుకోగా లాటరీలో దుకాణం వచ్చింది. ఆ వ్యక్తి రూ.1.10 కోట్లకు పాత సిండికేట్‌కు ఆ లైసెన్సును అమ్మేసుకున్నారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో ఒక దుకాణం.. హుజూర్‌నగర్‌లో మద్యం దుకాణదారుడికి లాటరీలో వచ్చింది. హుజూర్‌నగర్‌లోని మద్యం వ్యాపారికి మేళ్లచెరువులో దుకాణం లాటరీలో దక్కింది. మేళ్లచెరువులో సిమెంట్ పరిశ్రమలు అధికంగా ఉండటం, జాతరల వల్ల హుజూర్‌నగర్ కంటే వ్యాపారం అధికంగా జరుగుతుంది. దీంతో ఆ ఇరువురు తమ దుకాణాలను మార్చుకున్నారు. మేళ్లచెరువులో దుకాణాన్ని నడిపించుకోవడానికి హుజూర్‌నగర్ వ్యాపారికి అదనంగా రూ.50లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన కుటుంబసభ్యుల పేర్ల మీద రెండు షాపులు లాటరీలో దక్కించుకున్నారు. అతను ఒక్కో దుకాణాన్ని రూ.90లక్షల చొప్పున ఇతరులకు ఇచ్చేసి రాత్రికి రాత్రే లాటరీ రాజాగా మారిపోయాడు.
ఇది ఎక్సైజ్‌శాఖ నిబంధనలకు విరద్ధమే..
లైసెన్సుదారు స్థానంలో మరొకరు వ్యాపారం చేయడం ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధం. ఈ సంగతి తెలిసినా ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. తమకు దక్కిన లైసెన్సును మరొకరికి ఇచ్చేస్తే కష్టపడకుండా కోట్లు వస్తున్నాయని కొందరు ఆశపడుతున్నారు. మద్యం దుకాణంలో అనుకోని దుర్ఘటన ఏదైనా జరిగితే మాత్రం బాధ్యత వహించాల్సింది లైసెన్సుదారే అనే విషయం కొసమెరుపు.