చౌటుప్పల్ జాతీయ రహదారిపై లారీ బీభత్సం
ABN , Publish Date - Jul 15 , 2025 | 12:42 AM
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రం హైదరాబాద్ విజయవాడ జాతీయరహదారిపై సోమవారం ఓ లారీ బీభత్సం సృష్టించింది.
ఆరు కార్లు.. భైక్ ధ్వంసం
తప్పిన పెను ప్రమాదం
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన
చౌటుప్పల్ రూరల్ జూలై 14: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రం హైదరాబాద్ విజయవాడ జాతీయరహదారిపై సోమవారం ఓ లారీ బీభత్సం సృష్టించింది. సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళుతున్న లారీ బస్టాండ్ సమీపంలోకి రాగానే బ్రేకులు ఫెయిల్ అయి ముందు వెళుతున్న వాహనాలను 50మీటర్ల దూరం ఢీకొట్టుకుంటూ వెళ్లింది. వరుసగా ఆరు కార్లను, రోడ్డుపై నిలిపి ఉన్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి డివైడర్‌ను ఢీకొని అక్కడే ఉన్న పూల బండిని ఢీకొట్టి ఆగింది. ఈ సంఘటనలో ఆరు కార్లు, పల్సర్ బైక్ ధ్వంసం అయ్యాయి. కార్లలో ఉన్న పలువురికి స్వల్ప గాయ్యాలయ్యాయి. లారీకి బ్రేక్‌లు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ధ్వంసమైన కార్లను క్రేన్ సహాయంతో తొలగించారు. వాహనదారుల ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. కాగా లారీ డివైడర్‌ను డీకొట్టకుండా ఉంటే పెను ప్రమాదం జరిగేదని సీఐ తెలిపారు. డివైడర్ పక్కనే బస్సుల కోసం 50మందికి పైగా ప్రయాణికులు వేచి ఉన్నారని, లారీ డివైడర్‌ను డీకొట్టకుండా నేరుగా వెళితే పెను ప్రమాదం జరిగేదని తెలిపారు. ప్రయాద తీవ్రత ఎక్కువగా ఉన్నా ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.