Land Acquisition: జెన్కో మాజీ సీఎండీ ప్రభాకర్‌రావు సహా..
ABN , Publish Date - Sep 06 , 2025 | 03:44 AM
కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు కేటీపీపీ భూసేకరణలో అవకతవకలు జరిగాయని నిర్వాసితులు చేసిన ఫిర్యాదుపై లోకాయుక్త స్పందించింది. ఈ విషయంపై బాధితులు ఆగస్టు 4న లోకాయక్తను ఆశ్రయించగా..
8 మంది అధికారులకు లోకాయుక్త నోటీసు
కేటీపీపీ పరిహారం విషయంలో నిర్వాసితుల ఫిర్యాదు
భూపాలపల్లి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు(కేటీపీపీ) భూసేకరణలో అవకతవకలు జరిగాయని నిర్వాసితులు చేసిన ఫిర్యాదుపై లోకాయుక్త స్పందించింది. ఈ విషయంపై బాధితులు ఆగస్టు 4న లోకాయక్తను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసిన సంస్థ.. వివరణ ఇవ్వాలని సెప్టెంబరు 1న అధికారులకు నోటీసు జారీ చేసింది. ఇందులో జెన్కో మాజీ సీఎండీ ప్రభాకర్ రావు, ప్రస్తుత కలెక్టర్ రాహుల్ శర్మ, జెన్‌కో సివిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ.అజయ్, మాజీ చీఫ్ ఇంజనీర్ సిద్ధయ్య, ప్రస్తుత చీఫ్ ఇంజనీర్ ప్రకాశ్, భూపాలపల్లి డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, అప్పటి ఆర్డీవోలు శ్రీనివాస్, మాధవి ఉన్నారు. భూపాలపల్లి సమీపంలోని చెల్పూర్ రెవెన్యూలో కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు రెండో దశ నిర్మాణం కోసం 2019లో సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇస్తామని చెప్పిన అధికారులు.. ఆ తర్వాత తమకు చెప్పకుండానే 2017 తెలంగాణ భూసేకరణ చట్టాన్ని అనుసరించి స్థలాల సేకరణకు అంగీకరిస్తున్నట్టు తమ నుంచి సంతకాలు తీసుకున్నారని దుబ్బపల్లి గ్రామస్థులు చెబుతున్నారు. ప్రాథమిక ప్రకటనలో ఇచ్చిన బాధితుల పేర్లను డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో ప్రకటించినప్పటికీ.. అవార్డుల జారీలో చాలామంది పేర్లను తొలగించారని అంటున్నారు. 2017 చట్టం ప్రకారం ప్రకటించిన అవార్డులో పునరావాసానికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో బాధితులు అధికారుల తీరుపై భగ్గుమంటున్నారు. పరిహారం విషయంలోనూ సంప్రదింపుల సందర్భంగా నిర్ణయించిన మొత్తాన్ని కాకుండా అవార్డు తగ్గించి ప్రకటించడం పట్ల మండిపడుతున్నారు. ఆర్‌అండ్ ఆర్ ప్యాకేజీ జాబితాలో మైనర్లను చేర్చాల్సి ఉన్నా.. వారి ప్రస్తావనే లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.