Share News

పాల శీతలీకరణ కేంద్రానికి తాళం

ABN , Publish Date - Jun 05 , 2025 | 12:12 AM

మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పాల బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు మండలం ముశిపట్ల గ్రామానికి చెందిన పాడి రైతులు మోత్కూరు పాల శీతలీకరణ కేంద్రానికి బుధవారం తాళం వేశారు.

పాల శీతలీకరణ కేంద్రానికి తాళం
మోత్కూరు పాల శీతలీకరణ కేంద్రానికి తాళం వేసి ధర్నా చేస్తున్న ముశిపట్ల పాడి రైతులు

మోత్కూరులో పాడి రైతుల ఆందోళన

మూడు నెలలుగా పాల బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన

మోత్కూరు, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పాల బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు మండలం ముశిపట్ల గ్రామానికి చెందిన పాడి రైతులు మోత్కూరు పాల శీతలీకరణ కేంద్రానికి బుధవారం తాళం వేశారు. ప్రతి 15 రోజులకోసారి బిల్లు చెల్లించాల్సి ఉండగా మూడు నెలలుగా చెల్లించడం లేదని కేంద్రం ఎదుట ఆందోళన చేశారు. ఆరు బిల్లులు రూ7.20లక్షలు చెల్లించాల్సి ఉందని రైతులు చెప్పారు. పాల బిల్లు రాగానే ఇస్తామంటే తమకు దుకాణాల్లో అరువు(ఉద్దెర) కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పశువుల దాణా తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవన్నారు. పశువులకు దాణా పెట్టకుంటే అవి పాలు ఎలా ఇస్తాయని ప్రశ్నించారు. రైతులు పాల శీతలీకరణ కేంద్రానికి తాళం వేసి ధర్నా చేస్తుండగా గ్రామాల నుంచి సేకరించిన పాలు తీసుకుని మూడు పాల వ్యాన్లు వచ్చాయి. వాటిని రైతులు లోనికి వెళ్లనివ్వలేదు. గంట సేపట్లో వాటిని కేంద్రంలో చిల్లింగ్‌ చేయకుంటే చెడిపోతాయని కేంద్రం సిబ్బంది బతిమిలాడినా రైతులు తాళం తీయలేదు. మేనేజర్‌ అందుబాటులో లేరని, తాము సమాచారం ఇచ్చామని, ఇంటి వద్ద నుంచి వస్తున్నారని సిబ్బంది తెలిపారు. వ్యాన్లు లోనికి పంపాక మళ్లీ గేటు మూసి ఆందోళన కొనసాగించారు. మేనేజర్‌ వచ్చి ఒక బిల్లు (15రోజులవి) ఇస్తానంటే ఒప్పుకోలేదు. రెండు రోజుల్లో ఒక నెల బిల్లు (రెండు బిల్లులు) ఇస్తానని ఆయన హామీ ఇవ్వడం, మోత్కూరు ప్రాంతానికి చెందిన మదర్‌ డెయిరీ డైరెక్టర్‌ రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి కూడా ఫోన్‌ చేసి రెండు బిల్లులు ఇప్పిస్తానని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో పాల సంఘం చైర్మన్‌ పైళ్ల పెద్ద కవిత, వల్లపు అంతయ్య. పైళ్ల చినవెంకట్‌రెడ్డి, పైళ్ల సత్తిరెడ్డి, గనగాని నర్సింహ, పైళ్ల పాపిరెడ్డి, తండ వీరస్వామి, కందాల యాదయ్య, జిట్ట కిష్టయ్య, ముప్ప వీరారెడ్డి, సైదులు తదితరులు పాల్గొన్నారు.

ఫోన్‌లో మదర్‌డెయిరీ చైర్మన్‌, పాడి రైతు వాగ్వాదం

పాల శీతలీకరణ కేంద్రానికి తాళం వేసి రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలు సుకుని మదర్‌ డెయిరీ చైర్మన్‌ మధుసూ దన్‌రెడ్డి రైతులకు ఫోన్‌ చేశారు. పాడి రైతు వల్లపు అంతయ్యను ఏం తమాషా చేస్తున్నావా అని చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి దబాయించగా, నీకు చేతకాకపోతే పక్కకు తప్పుకో అంటూ రైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

రాజాపేటలో పాడి రైతుల రాస్తారోకో

రాజాపేట: పెండింగ్‌లో ఉన్న పాల బిల్లులను చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ యాదాద్రిభువనగిరి జిల్లా రాజాపేట మండలకేంద్రంలోని పాలశీతలీకరణ కేంద్రం రోడ్డుపై పాడి రైతులు బుధవారం రాస్తారోకో చేశారు. లీటర్లకు రూ.4ల ఇన్సెంటివ్‌ చెల్లించాలని, ప్రైవేట్‌ డెయిరీని అరికట్టి, మదర్‌ డెయిరీ కాపాడాలని నినాదాలు చేశారు. అనంతరం పాలశీతలీకరణ మేనేజర్‌ శేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ నెల 6న తుర్కపల్లిలో ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేయనున్నట్లు పలువురు చైర్మన్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలసంఘం చైర్మన్లు సందెల భాస్కర్‌గ్‌డ్‌, రామిడి బాపురెడ్డి, చింతలపూరి వెంకటరామిరెడ్డి, శీలం మల్లారెడి,్డ ఉపేందర్‌, బాలరాజిరెడ్డి, భూపాల్‌, దశరథ, సోమయ్య పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2025 | 12:12 AM