GHMC Re Division: పునర్విభజనలో గందరగోళం!
ABN , Publish Date - Dec 16 , 2025 | 04:40 AM
ఔటర్ రింగు రోడ్డు సరిహద్దుగా జీహెచ్‌ఎంసీని విస్తరిస్తూ చేపట్టిన డివిజన్ల పునర్విభజనపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.....
ఆ మునిసిపాలిటీల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను.. పూర్తిగా విస్మరించారని స్థానికుల ఆందోళన
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఔటర్ రింగు రోడ్డు సరిహద్దుగా జీహెచ్‌ఎంసీని విస్తరిస్తూ చేపట్టిన డివిజన్ల పునర్విభజనపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పునర్విభజన పూర్తి గందరగోళంగా ఉందని స్థానికులు అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న 20 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే పునర్విభజన చేపట్టారని పేర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో శివారు ప్రాంతాల్లోనూ పట్టణీకరణ శరవేగంగా జరుగుతోంది. కోర్ సిటీ నుంచి చాలామంది శివారు ప్రాంతాల్లోని గేటెడ్ కమ్యూనిటీలు, హైరైజ్ అపార్టుమెంటుల్లోకి మారుతుండడంతో జన సాంద్రత ఊహించని స్థాయిలో పెరుగుతోంది. ఉదాహరణకు నార్సింగి, మణికొండ, బండ్లగూడ జాగీర్ వంటి మునిసిపాలిటీల్లో గేటెడ్ కమ్యూనిటీలతో పాటు హైరైజ్ అపార్టుమెంట్ ప్రాజెక్టులు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇలాంటి మునిసిపాలిటీల్లో తక్కువ సంఖ్యలో డివిజన్లు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయడంపై స్థానికులు అభ్యంతరం తెలుపుతూ జీహెచ్‌ఎంసీకి లేఖలు రాస్తున్నారు. మై హోం అవతార్, రాజపుష్ప ప్రొవెన్షియా, వాసవి అట్లాంటిస్ వంటి భారీ హైరైజ్ ప్రాజెక్టులు, వీటి పక్కనే అపర్ణ జినాన్ 23 టవర్లలో పెద్ద సంఖ్యలో ప్రజలు నివసిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా తక్కువ సంఖ్యలో వార్డుల విభజన చేశారంటూ స్థానికులు విమర్శిస్తున్నారు. పోచారం మునిసిపాలిటీ విస్తీర్ణం, జనాభా, ఓటర్ల పరంగా పెద్దదే అయినా.. కేవలం ఒకే డివిజన్‌గా నిర్ణయించడంతో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి.
శంషాబాద్‌లో రెండే డివిజన్లు..
నగర శివారులోని నిజాంపేట, తెల్లాపూర్, అమీన్‌పూర్, తూంకుంట వంటి మునిసిపాలిటీల్లో ప్రస్తుత జనాభాను, ఓటర్ల సంఖ్యను, ఆ ప్రాంతాల భవిష్యత్తు విస్తరణను పరిగణనలోకి తీసుకోకుండానే విభజన చేశారని స్థానికులు అంటున్నారు. ముఖ్యంగా శంషాబాద్ ప్రాంతంలో అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతోంది. అలాంటి చోట కేవలం రెండే డివిజన్లు ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 25 వార్డులు ఉన్న ఆ మునిసిపాలిటీలో కొత్తగా కొన్ని గ్రామాలు చేర్చిన తర్వాత దాని పరిధి ఇంకా పెరిగినప్పటికీ.. కేవలం శంషాబాద్, కొత్వాల్‌గూడ పేరుతో రెండు డివిజన్లే ఏర్పాటు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా జీహెచ్‌ఎంసీ పునర్విభజనపై రాజకీయ పార్టీలు, కాలనీ, బస్తీ, ఇతరత్రా సంఘాలు లిఖిత పూర్వకంగా తమ అభ్యంతరాలు తెలుపుతున్నారు. ఫిర్యాదుల స్వీకరణకుగాను జీహెచ్‌ఎంసీ కేంద్ర, జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. సోమవారం ఒక్కరోజే 300 వరకు ఫిర్యాదులు వచ్చాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో సమావేశమై చర్చించారు. అనంతరం కమిషనర్ ఆర్‌వీ కర్ణన్‌ను కలిసి డివిజన్ల విభజన శాస్ర్తీయంగా జరపాలంటూ విజ్ఞప్తి చేశారు. సరిహద్దుల గుర్తింపు, పేర్ల విషయంలో తమ అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
కమిషనర్‌కు విజ్ఞప్తులు..
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, వివిధ ప్రాంతాల జేఏసీ నేతలు కూడా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను కలిసి తమ అభిప్రాయాలు తెలియజేశారు. గోషామహల్‌లో డివిజన్ల విభజన సరిగా లేదని ఎమ్మెల్యే రాజాసింగ్.. కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. టీడీపీ, ఇతర ప్రాంతాల కాలనీ, కుల సంఘాల నాయకులూ లిఖితపూర్వకంగా అభ్యంతరాలు తెలిపారు. పునర్విభజనపై పలు ప్రాంతాల జేఏసీ నేతలు సోమవారం జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. దోమలగూడ ప్రాంతాన్ని కవాడిగూడలో కలపడంపై ఆ ఏరియాకు చెందిన పలు పార్టీల నేతలు అభ్యంతరం తెలిపారు. దోమలగూడ పోలీ్‌సస్టేషన్ పరిధిని ప్రత్యేక డివిజన్‌గా గుర్తించాలని డిమాండ్ చేశారు. బడంగ్‌పేట, తుర్కయాంజల్ మునిసిపాల్టీలను చార్మినార్ జోన్‌లో కలపడం సబబు కాదని, ఆ ప్రాంత జేఏసీ నేతలు పేర్కొన్నారు. సమీపంలోని ఎల్‌బీనగర్ జోన్‌లో కలపాలని, లేని పక్షంలో ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, జీహెచ్‌ఎంసీ విస్తరణ నిర్ణయం బాగుందని, అయితే డివిజన్ల విభజనపై గందరగోళం నెలకొందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా పునర్విభజన చేశారని, అభ్యంతరాలను కమిషనర్‌కు చెప్పామని తెలిపారు. డివిజన్ల ఓటర్ల సంఖ్యలో భారీ వ్యత్యాసం ఉందని, అధికారులు ఇష్టానికి సరిహద్దులు ఫిక్స్ చేశారని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. ఏ ప్రాతిపదికన డివిజన్ల విభజన జరిగిందో అధికారులు స్పష్టత ఇవ్వడం లేదని, మంగళవారం లిఖితపూర్వకంగా అభ్యంతరాలు తెలియజేస్తామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెప్పారు.
పౌరులకు ఇబ్బంది కలగొద్దు..
జీహెచ్‌ఎంసీ విస్తరణకు బీఆర్‌ఎస్ వ్యతిరేకం కాదని, అయితే క్షేత్రస్థాయిలో పాలన, పౌరులకు ఇబ్బంది లేకుండా పునర్విభజన జరగాలని ఆ పార్టీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివా్‌సయాదవ్ అన్నారు. ఈ విషయంపై కౌన్సిల్‌లో, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. కాగా, మేడ్చల్ నియోజకవర్గంలో డివిజన్ల సంఖ్యను 16కు తగ్గించారని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. కాంగ్రె్‌సకు జీహెచ్‌ఎంసీలో పట్టు లేదని, బీఆర్‌ఎ్‌సను దెబ్బ తీసేందుకు సాంకేతిక అంశాలు పట్టించుకోకుండా పునర్విభజన ముసాయిదా సిద్ధం చేశారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు.
మెరుగైన సేవల కోసమే: పొన్నం
మెరుగైన పౌర సేవలు, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, ప్రజలకు అన్ని రకాలుగా ఉపయుక్తంగా ఉండేందుకే జీహెచ్‌ఎంసీ విస్తరణ చేపట్టామని హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శాస్ర్తీయంగా డివిజన్ల పునర్విభజన జరగడం వల్ల ప్రతి ప్రాంతానికి సమాన రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తుందన్నారు. విలీనమైన మునిసిపాలిటీల సమగ్ర అభివృద్ధి సులభమవుతుందని పేర్కొన్నారు. జనాభా, స్థానిక అవసరాల ఆధారంగా నిధుల కేటాయించవచ్చన్నారు.
614 వార్డులు.. 58 డివిజన్లుగా పునర్విభజన
జీహెచ్‌ఎంసీలో విలీనానికి ముందు 20 మునిసిపాలిటీల్లో 385 వార్డులు, 7 కార్పొరేషన్ల పరిధిలో 229 డివిజన్లు ఉన్నాయి. మొత్తం కలిపి 614 వార్డులు ఉండగా, విలీనం తర్వాత 20 మునిసిపాలిటీల్లో 39 డివిజన్లు, 7 కార్పొరేషన్ల పరిధిలో 19 డివిజన్లకు (మొత్తం 58) సరిహద్దులు నిర్ణయించారు. ఈ నిర్ణయంతో తమ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడిందని వివిధ పార్టీల నాయకులు వాపోతున్నారు.