Telangana High Court: ఏపీ సైనిక్ స్కూల్‌లో చదివితే స్థానికుడు కాదా?
ABN , Publish Date - Sep 17 , 2025 | 05:54 AM
ఏపీలో ఉన్న సైనిక్ స్కూల్‌లో తెలంగాణ కోటాలో, తెలంగాణ ప్రభుత్వ నిధులతో చదివిన విద్యార్థికి తెలంగాణ స్థానికత వర్తించదని ఎలా అంటారని రాష్ట్ర ప్రభుత్వాన్ని...
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
హైదరాబాద్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఏపీలో ఉన్న సైనిక్ స్కూల్‌లో తెలంగాణ కోటాలో, తెలంగాణ ప్రభుత్వ నిధులతో చదివిన విద్యార్థికి తెలంగాణ స్థానికత వర్తించదని ఎలా అంటారని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వ నిధులతో, తెలంగాణ కోటాలో ఏపీలోని సైనిక్ స్కూల్‌లో చదివిన తనను వైద్యవిద్య ప్రవేశాల్లో స్థానికుడిగా గుర్తించడం లేదంటూ వనపర్తి జిల్లాకు చెందిన ఎం.శశికిరణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌ల ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. నిజానికి జీవో 33పై సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా ఈఅంశం చర్చకు రాలేదని.. అందువల్ల మినహాయింపు వర్తించే అంశాల్లో సైనిక్ స్కూల్ అంశాన్ని ప్రస్తావించకపోయి ఉండవచ్చని పేర్కొంది. అయితే ఏపీలోని సైనిక్ స్కూల్‌లో తెలంగాణ కోటాకింద చదివిన మరో విద్యార్థికి తెలంగాణలో ఇంజినీరింగ్ ప్రవేశాలకు స్థానికత వర్తిస్తుందని హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ధర్మాసనం గుర్తుచేసింది. మరోవైపు సుప్రీంకోర్టు తర్వాత ఇలాంటి పరిస్థితి ఎదురవడం ఇదే మొదటిసారని, ప్రభుత్వం దీనిని పరిశీలించాల్సి ఉందని కాళోజీ వర్సిటీ తరఫు న్యాయవాది టి.శరత్ ధర్మాసనానికి వివరించారు. దీనితో ఈ అంశంపై అడ్వకేట్ జనరల్ వివరణ కోసం విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.