Bhadradri Student Sai Ritika: నేనెక్కడ లోకల్
ABN , Publish Date - Sep 13 , 2025 | 04:30 AM
తెలంగాణ ఆవిర్భావంతో భద్రాచలం వాసులకు ప్రత్యేకించి విద్యార్థులకు విభజన కష్టాలు తప్పట్లేదు. ఎంబీబీఎస్ చదవాలన్న తపనతో....
నీట్ ర్యాంకు సాధించినా కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్‌లో ‘నాన్ లోకల్’ సమస్య
భద్రాచలం విద్యార్థిని సాయి రితికకు విభజన కష్టాలు
భద్రాచలం, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆవిర్భావంతో భద్రాచలం వాసులకు ప్రత్యేకించి విద్యార్థులకు విభజన కష్టాలు తప్పట్లేదు. ఎంబీబీఎస్ చదవాలన్న తపనతో నీట్-2025లో ర్యాంకు సాధించిన భద్రాచలం విద్యార్థినికి రాష్ట్ర కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్‌లో ‘నాన్ లోకల్’ సమస్య ఎదురైంది. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా భద్రాచలం వాసి గర్నేపల్లి సాయి రితికకు నీట్-2025లో 720 మార్కులకు 438 మార్కులతో జాతీయ స్థాయిలో 1,41,256 ర్యాంక్ (తెలంగాణ ర్యాంకు 2,538) వచ్చింది. కానీ, ఎంబీబీఎస్ తదితర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్‌లో సాయి రితికకు ‘నాన్ లోకల్’ అని చూపడం ఆమెకు, ఆమె తల్లిదండ్రులకు ఆవేదన మిగులుస్తోంది. రితిక కుటుంబం నాలుగు దశాబ్దాలుగా భద్రాచలంలోనే ఉంటోంది. తండ్రి అశోక్ కుమార్ వ్యాపారంతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయన కూతురు సాయి రితిక.. భద్రాచలం సరిహద్దుల్లోని ఆంధ్రప్రదేశ్- అల్లూరి జిల్లా పురుషోత్తమపట్నంలో పదో తరగతి వరకూ.. హైదరాబాద్- బాచుపల్లిలోని ప్రైవేటు జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివారు. అయితే, 2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతం కింద ఏపీలో కలిపిన 7మండలాల్లో యటపాక ఒకటి. పురుషోత్తమపట్నం ప్రస్తుతం యటపాక మండలంలోని గ్రామం కావడం గమనార్హం. తద్వారా.. నీట్-2025లో ర్యాంకు ద్వారా కన్వీనర్ కోటా అడ్మిషన్లకు సాయి రితిక అర్హత సాధించినా.. కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్‌లో నాన్ లోకల్‌గా పరిగణించడంతో తమకు నష్టం జరిగిందని తండ్రి అశోక్ కుమార్ వాపోయారు. ఏపీలో నాన్ లోకల్ విద్యార్థులకు అన్‌రిజర్వుడ్ కోటాలో 15ు సీట్లు కేటాయిస్తూ జీవో ఉండగా, తెలంగాణలో అది కూడా లేదని ఆవేదన వ్యక్తంచేశారు. భద్రాచలం వాసులకు విద్యారంగంలో కలుగుతున్న ఇబ్బందులను స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తెచ్చారు. 33 నంబర్ జీవో ద్వారా మానవీయ కోణంలో భద్రాచలం విద్యార్థులను తెలంగాణ స్థానికత కోటా అనుమతించాలని సీఎంను కోరారు. రితిక తండ్రి అశోక్ కుమార్ కూడా తన కూతురుకు న్యాయం చేయాలని వేడుకున్నారు.