Telangana Local Elections: స్థానికం.. సర్వం సిద్ధం.. నేడు జీవో జారీ
ABN , Publish Date - Sep 26 , 2025 | 06:38 AM
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రభుత్వం విడుదల చేయనున్న ప్రత్యేక ఉత్తర్వులు మినహా మిగతా వ్యవహరమంతా దాదాపు పూర్తయింది.
నేడు ఏ క్షణమైనా జీవో.. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రభుత్వం విడుదల చేయనున్న ప్రత్యేక ఉత్తర్వులు మినహా మిగతా వ్యవహరమంతా దాదాపు పూర్తయింది. శుక్రవారం ఏ క్షణమైనా జీవో వెలువడే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాల సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా వార్డు సభ్యుల నుంచి జెడ్పీ చైర్‌పర్సన్ వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించే స్థానాలు, ఆయా సామాజికవర్గాల శాతాన్ని బట్టి రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారయ్యాయి. ప్రభుత్వం జీవో విడుదల చేయగానే ఆ వివరాలతో గెజిట్ ప్రచురించనున్నారు. మరోవైపు స్థానిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు దాదాపు పూర్తయింది. పంచాయతీరాజ్ శాఖ క్షేత్రస్థాయిలో జిల్లా పరిషత్ ముఖ్య అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులతో సంప్రదింపులు చేస్తోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే రిటర్నింగ్ అధికారుల నుంచి చెక్‌పోస్టుల వరకు అన్నింటినీ ఎంపీడీవోలు ఖరారు చేశారు. గురువారం రాత్రే పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులకు పంపారు. ఇక క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది ఎవరూ సెలవులు తీసుకోవద్దనే సూచన కూడా వెళ్లినట్టు సమాచారం. అయితే మొదట ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకా.. లేక పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారా అన్నదానిపై స్పష్టతరాలేదు.