Share News

Telangana State Election Commission: నేడే స్థానిక షెడ్యూల్‌?

ABN , Publish Date - Sep 29 , 2025 | 04:25 AM

తెలంగాణలో స్థానిక సంస్థల సమరానికి రంగం సిద్ధమైంది. ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కోరిన నేపథ్యంలో సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం...

Telangana State Election Commission: నేడే స్థానిక  షెడ్యూల్‌?

  • స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం!

  • అన్ని ఏర్పాట్లుచేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

హైదరాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో స్థానిక సంస్థల సమరానికి రంగం సిద్ధమైంది. ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కోరిన నేపథ్యంలో సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఇందుకనుగుణంగానే ఎన్నికల కమిషనర్‌ ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సిద్ధం చేసిన స్థానిక సంస్థల రిజర్వేషన్ల నివేదికలను ఆ శాఖ ఇప్పటికే ఎస్‌ఈసీకి అందజేసింది. అదే సమయంలో ఈ నెల 30లోపు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయాలని ఎస్‌ఈసీని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అయితే 30న సద్దుల బతుకమ్మ సందర్భంగా సెలవు ఉండటంతో.. ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేయాలని ఎస్‌ఈసీ నిర్ణయించినట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణకుగాను ఇప్పటికే ఎక్సైజ్‌, పోలీస్‌, పంచాయతీరాజ్‌ శాఖల ద్వారా ఎస్‌ఈసీ నివేదికలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఆ తర్వాత సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఇందుకు అనుగుణంగానే షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియను వేగంగా ముగించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో.. ఎస్‌ఈసీ కూడా ఇందుకనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు గతంలో మాదిరిగా మూడు దశల్లో లేదంటే రెండు దశల్లో ఎన్నికలు ముగిసేలా షెడ్యూల్‌ సిద్ధంచేయనున్నట్లు తెలుస్తోంది. అన్ని స్థాయిల్లో ఎన్నికలకు సంసిద్ధత ఉన్న కారణంగా.. రెండు, మూడు వారాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసే అవకాశం ఉందంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓటరు జాబితాను సిద్ధం చేయడమే కాకుండా.. ఎన్నికల విధుల కోసం సిబ్బంది నియామకం, శిక్షణ వంటివి ఇప్పటికే పూర్తిచేశారు. అంతేకుండా పోలింగ్‌ స్టేషన్ల సంఖ్యకు అనుగుణంగా బ్యాలెట్‌ బాక్సులను, ఎన్నికల సామగ్రిని కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకొని సోమవారం జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేస్తే.. రెండు, మూడు వారాల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసే అవకాశం ఉంటుందని.. ఎస్‌ఈసీ విభాగాలు తెలిపాయి. ఎక్కువ మంది ఓటింగ్‌లో పాల్గొనేలా ఎన్నికల తేదీలను ఖరారు చేయాలని ఎస్‌ఈసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Updated Date - Sep 29 , 2025 | 04:25 AM