Liquor Business: బాబ్బాబూ.. దరఖాస్తు చేసుకోండి!
ABN , Publish Date - Oct 09 , 2025 | 04:44 AM
మద్యం వ్యాపారాన్ని మించినది లేదు.. తక్కువ పెట్టుబడితో, తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వచ్చేది ఇదే.. ఫలానా మద్యం షాపు వాళ్లు ...
మద్యం వ్యాపారానికి మించింది లేదు.. ఎక్సైజ్ శాఖ అధికారుల ప్రచారం
అయినా ఆసక్తి చూపని వ్యాపారులు
రెండు వారాల్లో వచ్చిన దరఖాస్తులు 1,581.. మరో 10 రోజులే గడువు
ఈసారి దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు
హైదరాబాద్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ‘మద్యం వ్యాపారాన్ని మించినది లేదు.. తక్కువ పెట్టుబడితో, తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వచ్చేది ఇదే.. ఫలానా మద్యం షాపు వాళ్లు ఇన్ని కోట్లు సంపాదించారు.. మీరూ దరఖాస్తు చేయండి.. మీతోటి వాళ్లతో దరఖాస్తులు చేయించండి’ అంటూ ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రచారం చేస్తున్నారు. ఔత్సాహికులను ప్రోత్సహిస్తున్నారు. అయినా అధికారుల అంచనాలకు తగ్గట్లు దరఖాస్తులు రావడం లేదు. దసరా రోజు భారీగా దరఖాస్తులు చేస్తారనే నమ్మకంతో పండుగకు ముందే నోటిఫికేషన్ జారీ చేశారు. రెండు వారాలుగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నా ఇప్పటి వరకు కేవలం 1,581 దరఖాస్తులు మాత్రమే అందాయి. ఈ నెల 18తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది. ఈసారి దరఖాస్తుల విక్రయాల ద్వారానే రూ.3 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. అంటే దాదాపు లక్ష దరఖాస్తులైనా రావాలి. రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి రెండేళ్ల గడువు నవంబరు 30తో ముగియనుండటంతో గత నెల 25న కొత్త మద్యం పాలసీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఈ నెల 23న లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయిస్తారు. డ్రాలో ఎంపికైనవారు డిసెంబరు 1 నుంచి కొత్త దుకాణాలు ప్రారంభించుకోవచ్చు. క్రితం సారి దరఖాస్తు రుసుము రూ.2 లక్షలు ఉండటంతో దాదాపు 1.31 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల విక్రయాలతోనే దాదాపు రూ.2,645 కోట్ల ఆదాయం సమకూరింది. దరఖాస్తు రుసుమును ఈసారి రూ.3 లక్షలకు పెంచారు. దీంతో గతంలో కంటే దరఖాస్తులు తగ్గినా ఆదాయం పెరిగి రూ.3 వేల కోట్లకుపైనే రావచ్చని ఎక్సైజ్ శాఖ భావించారు. ఈ ఆదాయం రావాలంటే గడువు ముగియడానికి మిగిలిన 10 రోజుల్లో రోజుకు 10 వేల చొప్పున దరఖాస్తులు రావాలి. కానీ గత నెల 26 నుంచి బుధవారం వరకు 1,581 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీంతో దరఖాస్తులు చేసుకోమంటూ ఎక్సైజ్ శాఖ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ప్రస్తుతం చాలామంది స్థానిక సంస్థల ఎన్నికల్లో నిమగ్నమయ్యారు. మద్యం షాపులు, బార్ల యజమానులు సిండికేట్‌గా దరఖాస్తులు వేస్తున్నారు. గతంలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రావడం లేదు. దరఖాస్తు రుసుం రూ.లక్ష పెంచడం భారంగా మారిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి దుకాణాల వారీగా గతంలో వచ్చిన దరఖాస్తులకు తగ్గకుండా చూడాలని ఆదేశించారు. చివరి నాలుగైదు రోజుల్లో ఎక్కువ దరఖాస్తులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1,834 దుకాణాలు ఓపెన్ క్యాటగిరీలో ఉండగా వాటికి 992 దరఖాస్తులు వచ్చాయి. గౌడ్‌లకు 393 దుకాణాలు కేటాయించగా 223 మంది, ఎస్సీలకు 262 రిజర్వు చేయగా 55, ఎస్టీలకు 131 షాపులు కేటాయించగా 13 దరఖాస్తులు వచ్చాయి.