Liquor License: మద్యం దరఖాస్తులకు సెంటిమెంట్ బ్రేక్!
ABN , Publish Date - Oct 22 , 2025 | 04:56 AM
రాష్ట్రంలో మద్యం దుకాణాల దరఖాస్తులకు అమావాస్య, మంగళవారం సెంటిమెంట్ బ్రేక్ వేసింది. మంచిరోజు కాదనే ఉద్దేశంతో మద్యం వ్యాపారులు...
అమావాస్య, మంగళవారం ప్రభావంతో ఒక్క దరఖాస్తూ రాని తీరు
నేడు పాడ్యమి భయం! మిగిలినది ఒక్క రోజే
ఇప్పటివరకు 89వేలు దాటిన దరఖాస్తులు..
హైదరాబాద్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మద్యం దుకాణాల దరఖాస్తులకు అమావాస్య, మంగళవారం సెంటిమెంట్ బ్రేక్ వేసింది. మంచిరోజు కాదనే ఉద్దేశంతో మద్యం వ్యాపారులు, ఔత్సాహికులు ఎవరూ ముందుకురాకపోవడంతో మంగళవారం ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. పాడ్యమి ఉన్న నేపథ్యంలో బుధవారం కూడా దరఖాస్తులు వస్తాయో, లేదోనన్న సందేహాలు ఉన్నాయి. ఈ క్రమంలో గడువు ముగిసే 23వ తేదీ గురువారం ఒక్కరోజుపైనే అధికారులు ఆశలు పెట్టుకున్నారు. మొత్తం లక్షకుపైగా దరఖాస్తులు వస్తాయని భావించినా, ఇప్పటివరకు 89,344 దరఖాస్తులే వచ్చాయి. గురువారం గడువు ముగిసేకల్లా లక్ష దరఖాస్తులు దాటుతాయని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాల కోసం దరఖాస్తులను ఆహ్వానించగా.. శనివారం (18వ తేదీ) రాత్రి వరకు 89,344 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఆ రోజున బీసీ బంద్ వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయామన్న పలువురు వ్యాపారుల అభ్యర్థన మేరకు ఎక్సైజ్ శాఖ గడువును ఈ నెల 23 (గురువారం) వరకు పొడిగించింది. 27న డ్రా తీసి వ్యాపారులను ఎంపిక చేస్తామని తెలిపింది. గడువుపెంచినా.. అందులో ఆదివారం, సోమవారం (దీపావళి)సెలవులు కావడం, మంగళవారం అమావాస్య కలయిక ఉండటంతో ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. పాడ్యమి రోజున కొత్త పనులు మొదలుపెట్టకూడదనే సెంటిమెంట్ ఉందని, ఆ రోజున కూడా మందకొడిగా దరఖాస్తులు రావొచ్చని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
శంషాబాద్‌లో అత్యధికం.. ఆసిఫాబాద్‌లో అత్యల్పం..
ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే.. రాష్ట్రంలో అత్యధికంగా శంషాబాద్ ఎక్సైజ్ డివిజన్‌లో 8,110, సరూర్‌నగర్‌లో 7,595 దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా ఆసిఫాబాద్ డివిజన్‌లో 622, వనపర్తిలో 676 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ కోసం అన్ని జిల్లా కేంద్రాల్లోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయాలతోపాటు.. గతానికి భిన్నంగా ఈసారి హైదరాబాద్‌లోని ఆబ్కారీ భవన్‌లో కూడా కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఏ జిల్లాలోని దుకాణానికైనా ఇక్కడ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. చివరి రోజున ఏ దుకాణానికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే సమాచారాన్ని ప్రతి గంటకోసారి ఎక్సైజ్‌శాఖ అధికారులు వెల్లడించనున్నారు. దీనితో ఏ దుకాణాలకు తక్కువ దరఖాస్తులు వచ్చాయనేది తెలుసుకుని.. వాటికి దరఖాస్తు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎక్సైజ్ శాఖకు ఇప్పటివరకు 89,344 దరఖాస్తులతో రూ.2,680 కోట్ల ఆదాయం సమకూరింది. గడువు ముగిసే సరికి రూ.3వేల కోట్లపైనే ఆదాయం వస్తుందని ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు.