Drunk on Dussehra: మందు బాబుల ముందుచూపు!
ABN , Publish Date - Oct 02 , 2025 | 05:01 AM
పండుగ ఏదైనా.. మద్యం ఉంటే ఆ కిక్కే వేరు. అది లేకుంటే మందుబాబులకు నిస్తేజమే. ఈసారి విజయదశమి....
దసరా రోజే గాంధీ జయంతితో మద్యం, మాంసం దుకాణాల బంద్
దీంతో బుధవారం వైన్‌షాపుల వద్దపోటెత్తిన మద్యం ప్రియులు
4 రోజులుగా రెట్టింపు అమ్మకాలు
బుధవారం ఒక్క రోజేఎక్సైజ్ శాఖకు 340 కోట్ల ఆదాయం
కిక్కిరిసిపోయిన మాంసం షాపులు
హైదరాబాద్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): పండుగ ఏదైనా.. మద్యం ఉంటే ఆ కిక్కే వేరు. అది లేకుంటే మందుబాబులకు నిస్తేజమే. ఈసారి విజయదశమి, గాంధీ జయంతి ఒకేరోజు (గురువారం) వచ్చాయి. దీంతో ప్రభుత్వం గురువారం రాష్ట్రంలో జంతు బలులు, మద్యం విక్రయాలపై నిషేధం విధించింది. ఈ ఉత్వర్వు మందు బాబులకు షాకిచ్చింది. దీంతో వారు ముందు జాగ్రత్త పడ్డారు. నాలుగు రోజులుగా వారంతా మద్యం షాపులకు క్యూ కట్టారు. విచ్చలవిడిగా కావాల్సినంత మద్యాన్ని కొనుగోలు చేసుకుని నిల్వ పెట్టుకున్నారు. రాష్ట్రంలో సాధారణ రోజుల్లో ఎక్సైజ్ శాఖకు రోజుకు సగటున రూ.100 నుంచి రూ.150 కోట్ల ఆదాయం వస్తుండగా.. విజయ దశమి కంటే ముందు నాలుగైదు రోజులుగా మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. ఆబ్కారీ శాఖకు వస్తున్న ఆదాయమే అందుకు కారణంగా చెప్పవచ్చు. ఆది, సోమ, మంగళ వారాల్లో వరుసగా 280-290-300 కోట్ల రూపాయల ఆదాయం రాగా.. దసరా ముందు రోజు బుదవారం మాత్రం ఎక్సైజ్ ఆదాయం ఏకంగా రూ.340 కోట్లకు దాటింది. అంటే.. ఈ లెక్కలను చూస్తే.. గాంధీ జయంతిని దృష్టిలో పెట్టుకుని మందు బాబులు విజయదశమికి ముందే భారీగా మద్యం కొనుగోలు చేసుకున్నారని స్పష్టమవుతోంది. కొనుగోలు చేసిన మద్యాన్ని వివిధ ప్రాంతాల్లో నిల్వ చేసుకుని .. దసరా పండుగను జోరుగా జరుపుకోవడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకున్నారు. దసరా సందర్భంగా పలు ప్రాంతాల్లో జాతరలు కూడా ఉండటంతో మద్యాన్ని ముందస్తుగానే కొనుగోలు చేసుకున్నారు. దసరాకు ఒక్క రోజు ముందు బుధవారం నాడు ఉద్యోగులకు జీతాలు కూడా పటడంతో మద్యం షాపులు, మాంసం కొట్లు వద్ద జనం కిక్కిరిసిపోయారు. అక్టోబరు 2న మాంసం దుకాణాలు మూసి ఉంటాయని ముందు రోజు అంటే బుధవారం నాడే తీసుకెళ్లాలని విక్రయదారులు షాపు ల ముందు బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో చాలా ప్రాంతాల్లో విజయ దశమి కంటే ఒక రోజు ముందే మాంసం కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు.