Share News

Gurukul Hostel Building Collapses: కూలిన గురుకుల హాస్టల్‌ భవనం

ABN , Publish Date - Sep 10 , 2025 | 04:10 AM

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామంలోని గురుకుల పాఠశాలలోని హాస్టల్‌ భవనం మంగళవారం ..

Gurukul Hostel Building Collapses: కూలిన గురుకుల హాస్టల్‌ భవనం

  • ముగ్గురు విద్యార్థులకు గాయాలు

  • భోజన విరామ సమయంలో కూలడంతో తప్పిన పెనుప్రమాదం

  • సంగారెడ్డి జిల్లా లింగంపల్లిలో ఘటన

  • ఘటనాస్థలిని పరిశీలించిన మంత్రి దామోదర రాజనర్సింహ

మునిపల్లి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామంలోని గురుకుల పాఠశాలలోని హాస్టల్‌ భవనం మంగళవారం కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. పాఠశాలకు చెందిన విద్యార్థులంతా ఆ భవనంలోనే వసతి పొందుతున్నారు. కానీ, అదృష్టం కొద్దీ భోజన విరామ సమయంలో భవనం కూలడం వల్ల పెను ప్రమాదమే తప్పింది. లింగంపల్లి గురుకుల పాఠశాలలో మొత్తం 601 మంది విద్యార్థులు ఉన్నారు. ఏళ్లుగా శిథిలావస్థలో ఉన్న పాఠశాలలోని ఓ భవనంలో విద్యార్థులకు వసతి కల్పిస్తున్నారు. ఎప్పట్లాగే విద్యార్థులంతా మంగళవారం ఉదయం హాస్టల్‌ నుంచి పక్కనే ఉన్న పాఠశాలకు వెళ్లిపోయారు. అయితే, భోజన విరామ సమయంలో హాస్టల్‌ ముందుకు ముగ్గురు విద్యార్థులు వస్తున్న క్రమంలో.. ఆ భవనం వెనుక భాగం గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఆ పెచ్చులు, ఇటుకలు తగిలి తిరూర్‌ జ్ఞానేశ్వర్‌(పదో తరగతి), శివ( ఇంటర్‌ ఫస్టియిర్‌), అరవింద్‌(ఆరో తరగతి) అనే విద్యార్థులు గాయపడ్డారు. బాధిత విద్యార్థులను పాఠశాల సిబ్బంది హుటాహుటిన జహీరాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక, విషయం తెలిసి ఘటనాస్థలికి చేరుకున్న టీఎ్‌సఎ్‌ఫడీ, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు శిథిలాల కింద ఉన్న విద్యార్థుల సామగ్రి, ఇతర వస్తువులను తరలించే పని మొదలుపెట్టాయి. వారు విద్యార్థుల ట్రంక్‌ పెట్టెలను బయటకు తీస్తున్న క్రమంలో భవనంలో మిగిలిన భాగం కూడా నేలమట్టమైంది. శిథిలాల కింద 80 మంది ఏడో తరగతి విద్యార్థులకు చెందిన వస్తువులు ఉన్నట్టు ఉపాధ్యాయులు తెలిపారు. ఇక, పాఠశాల భవనం కూలిన విషయం తెలుసుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పాఠశాల, హాస్టల్‌లో నెలకొన్న సమస్యలపై నివేదిక ఇవ్వాలని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ సురభి చైతన్యను ఆదేశించారు. అలాగే, పాఠశాలల్లో పురాతన భవనాలను గుర్తించి వెంటనే కూల్చివేయాలని అధికారులకు సూచించారు. మంత్రితోపాటు జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్‌ పంకజ్‌, డీఈఓ వెంకటేశ్వర్లు పాఠశాల భవనాన్ని పరిశీలించారు. భవనం శిథిలావస్థలో ఉన్న విషయాన్ని అధికారుల దృష్టికి ఎందుకు తీసుకురాలేదంటూ జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య లింగంపల్లి గురుకుల పాఠశాల నిర్వాహకులపై ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనంలో విద్యార్థులు ఉన్న సమయంలో ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి ఏంటి ? అని ప్రశ్నించారు. విద్యార్థులు ఉన్నప్పుడు ఘటన జరిగి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేందన్నారు. విద్యార్థులకు తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేయించిన కలెక్టర్‌... పాఠశాల నూతన భవన నిర్మాణం కోసం రూ.7 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. భవనం కూలిన సంగతి తెలిసి మిగిలిన విద్యార్థులను వారి తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లారు.

Updated Date - Sep 10 , 2025 | 04:10 AM