వేసవిలోనూ నిండు కుండలా..
ABN , Publish Date - May 14 , 2025 | 12:08 AM
వేసవి ఎండలు మండుతున్న పరిస్థితుల్లోనూ మూసీ ప్రాజెక్టు నీటితో నిండుకుండలా తొణికిసలాడుతోంది.
రెండు సీజన్లకు సాగు నీరిచ్చినా తగ్గని మూసీ ప్రాజెక్టు నీరు
పెరుగుతున్న నీటి మట్టం
కేతేపల్లి, మే 13(ఆంధ్రజ్యోతి): వేసవి ఎండలు మండుతున్న పరిస్థితుల్లోనూ మూసీ ప్రాజెక్టు నీటితో నిండుకుండలా తొణికిసలాడుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత రెండో పెద్ద నీటివనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టు ఈ ఏడాది తరగని నీటినిల్వలతో కళకళలాడుతోంది. ఈ ఏడాది వానాకాలం, యాసంగి సీజన్‌లలో దాదాపు 35వేల ఎకరాల ఆయకట్టుతో పాటు అంతే విస్తీర్ణంలో అక్రమంగా పంపుసెట్లతో నీటి తరలింపు ద్వారా నాన్ ఆయకట్టు భూముల్లో పంటలను రైతులు సాగు చేశారు. అయినా ఎగువ మూసీ పరీవాహక ప్రాంతాలు, హైదరాబాద్ నుంచి నిరంతరాయంగా కొనసాగుతున్న ఇన్‌ఫ్లోతో ప్రాజెక్టు నీటిమట్టం ఒక్కో అడుగు పెరుగుతూ వస్తోంది. 645అడుగులు(4.46టీఎంసీలు) పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం గల మూసీ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 634.20అడుగులు(2.04టీఎంసీలు)గా ఉంది. గత ఏప్రిల్ 6న యాసంగి సీజన్ పంటలకు సాగు నీటి విడుదలను నిలిపి వేసే నాటికి 623.50అడుగులు (0.71టీఎంసీలు)గా ఉన్న ప్రాజెక్టు నీటిమట్టం 37 రోజుల్లో 10.07అడుగుల మేర పెరిగి ప్రస్తుతం 634.20 అడుగులకు చేరింది. ప్రస్తుతం ఎగువ నుంచి 489.11 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టు నీటిమట్టం 629.15అడుగులుగా ఉండగా ఈ ఏడాది 5అడుగుల మేర నీరు అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో అకాల వర్షం కురిసి ఇన్‌ఫ్లో ఏమాత్రం పెరిగినా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకునే వీలుంది. దీంతో ప్రాజెక్టు ఇంజనీరింగ్ యంత్రాంగం ప్రాజెక్టు గేట్ల నిర్వహణ సులువు చేసే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రాజెక్టు క్రస్టు, రెగ్యులేటరీ గేట్లు, గేట్లను ఎత్తేందుకు వినియోగించే విద్యుత్ మోటార్ల పుల్లీలకు ఆయింలింగ్, గ్రీజింగ్ పనులు చేపట్టచేందుకు ప్రయత్నిస్తున్నారు.