Kaleshwaram Project: తెలంగాణకు కాళేశ్వరమే జీవధార
ABN , Publish Date - Sep 14 , 2025 | 04:35 AM
తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టే జీవధార అని, ఈ ప్రాజెక్టును ఓ వైఫల్యంగా చిత్రీకరించేందుకు సర్కారు యత్నించడం సరికాదని పలువురు..
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు, నిపుణులు
పంజాగుట్ట, సెప్టెంబరు13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టే జీవధార అని, ఈ ప్రాజెక్టును ఓ వైఫల్యంగా చిత్రీకరించేందుకు సర్కారు యత్నించడం సరికాదని పలువురు నాయకులు, లక్ష కోట్ల అవినీతి అంటూ ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీనియర్ జర్నలిస్టు ఎ.రమణ కుమార్ అధ్యక్షతన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘గోదావరి జలాలు- కాళేశ్వరం ప్రాజెక్టు’ అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, సీపీఎం నాయకుడు సాగర్, సీపీఐ నాయకురాలు పశ్య పద్మ, నీటిపారుదల రంగ నిపుణుడు వి.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నీటి కోసం, భూమి కోసం ఎన్ని లక్షల కోట్లు ఖర్చు చేసినా తప్పు లేదని, కానీ ప్రజాధనం వృథా కావొద్దని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. మేడిగడ్డలో కుంగిన పిల్లర్లను బూచీగా చూపి గోదావరి జలాలను బనకచర్ల తీసుకెళ్లేందుకు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు కుట్ర చేస్తున్నారని క్రాంతి కిరణ్ ఆరోపించారు. దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు కాలువలు లేదా టన్నెల్ ద్వారా నీటిని తరలించే అవకాశం లేనందునే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించాల్సి వచ్చిందన్నారు. రిటైర్డ్ ఇంజనీర్ టి.వెంకటేశం మాట్లాడుతూ మేడిగడ్డ సహా ఇతర బ్యారేజీల నుంచి ఇప్పటికీ నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందన్నారు.