kumaram bheem asifabad- జిల్లాలో పార్టీని బలోపేతం చేద్దాం
ABN , Publish Date - Dec 27 , 2025 | 10:06 PM
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అంతా కలిసికట్టుగా కృషి చేద్దామని డీసీసీ అధ్యక్షురాలు సుగుణ అన్నారు. కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్సీ దండే విఠల్ నివాసంలో శనివారం జిల్లా స్థాయి డీసీసీ కమిటీ నూతన కార్యవర్గ విస్తరణ సమావేశంలో ఆమె మాట్లాడారు.
కాగజ్‌నగర్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అంతా కలిసికట్టుగా కృషి చేద్దామని డీసీసీ అధ్యక్షురాలు సుగుణ అన్నారు. కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్సీ దండే విఠల్ నివాసంలో శనివారం జిల్లా స్థాయి డీసీసీ కమిటీ నూతన కార్యవర్గ విస్తరణ సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టినట్టు వివరించారు. నిరుపేదలకు అన్ని పథకాలు అందేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమలు చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గడీల పాలనను బద్దలు కొట్టి ప్రజలకు విముక్తి కల్పించి ప్రజా పాలన కార్యక్రమాలు చేస్తోంది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు వంద శాతం న్యాయం జరుగుతుందని చెప్పారు. పదవులు రాలేదని నిరుత్సాహ పడకుండా పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత మంది కోవర్టులుగా వ్యవహరించి ఇతర పార్టీలకు మద్దతు పలికారని పక్కా ఆధారాలు ఉన్నాయని తెలిపారు. వీరిపై తప్పకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అన్నారు. త్వరలో నిర్వహించే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించేందుకు పాటుపడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బిహార్‌లో ఓటు దొంగతనం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. త్వరలోనే జాతీయ కమిటీ నేతృత్వంలో నిజాలను ప్రజల ముందుకు తీసుకెళ్లనున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సముచితం తప్పకుండా కల్పిస్తున్నదని చెప్పారు. పదవులు రాని వారు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ఇంటింటా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ సిర్పూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఉందని చెప్పారు. సిర్పూరు నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పార్టీకి వచ్చిన ఓటింగ్ శాతం, ప్రస్తుతం వచ్చిన ఓటింగ్ శాతం పోలిస్తే 51 శాతం పెరిగిందని తెలిపారు.సమావేశంలో మాజీ జడ్పీ చైర్మన్ సిడాం గణపతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీవర్థన్, మహేష్, మార్కెట్ కమిటి చైర్మన్ సుద్దాల దేవయ్య, జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండా శ్యాం, ఆత్మ చైర్మన్ రామరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ దస్తగీర్, నూతనంగా గెలుపొందిన సర్పంచిలు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచి, నాయకుల పిల్లల శంకరయ తదితరులు పాల్గొన్నారు. కాగా జిల్లా స్థాయి సమావేశం జరుగుతుండడంతో పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నప్పటికీ సముచిత స్థానం కల్పించడం లేదని వాపోయారు. సిర్పూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు మూడో స్థానంలో నిలిచారని అన్నారు. విషయాన్ని జిల్లా నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. పరిస్థితి చేజారిపోతోందని గ్రహించిన పలువురు నాయకుకలు కార్యకర్తలను సముదాయించారు.
సంక్షేమ పథకాలు అందజేస్తాం
జైనూర్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జంగాం ప్రజలకు వర్తింపజేసి అభివృద్ధికి పాటు పడుతామని డీసీసీ అధ్య క్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. మండలంలోని జంగాంలో శనివారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, కార్యకర్తలు ఆమెకు డప్పులు వాయిద్యాల మధ్య ఘన స్వాగతం పలికారు. సర్పంచ్ పెందుర్ అనసూయా అర్జున్ గ్రామస్థుల సమక్షంలో కాంగ్రేస్ పార్టీలో చేరారు. డీసీసీ అధ్యక్షురాలు సర్పంచ్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్, బీజేపీలకు చెందిన వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. జనసేన యూత్ అధ్యక్షుడు సయ్యద్ ఈర్ఫాన్‌తో పాటు ఉపాధ్యక్షులు జైరాం, బాలు, చాహకటి క్రిష్ణ, సబేర్, మారుతి, కొలె దాదారావ్, షేక్ హసన్, కిర్తన్‌రావ్, సయద్ షకీల్, రాథొడ్ దినేష్, పెందుర్ సంజు,భీంరావ్, గోపాల్, ఇస్మాయిల్, సురెందర్, జాధవ్ రవిందర్‌లు, గ్రామంలోని పలువురు యువకులు సుగుణక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆత్రం సుగుణ మాట్లాడుతూ జంగాంలో భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరడం అభినందనీయమని చెప్పారు. జంగాం వాసులకు ప్రభుత్వం పరంగా ఇందిరమ్మ ఇళ్లు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో నాయకుడు పెందుర్ అర్జున్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.