kumaram bheem asifabad- యువజన ఉత్సవాల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలుపుదాం
ABN , Publish Date - Nov 18 , 2025 | 10:58 PM
యువజన ఉత్సవాల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలుపుదామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్‌లో జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన జాతీయ యువజన ఉత్సవాల సందర్భంగా జిల్లా స్థాయి యువజన కళాకారుల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆసిఫాబాద్, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): యువజన ఉత్సవాల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలుపుదామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్‌లో జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన జాతీయ యువజన ఉత్సవాల సందర్భంగా జిల్లా స్థాయి యువజన కళాకారుల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమలోని కళా నైపుణ్యాన్ని, ప్రతిభను బాహ్య ప్రపంచానికి తెలియపర్చడం కోసం ఇలాంటి వేదికలు ఎంతో ఉపయోగపడుతాయని చెప్పారు. జిల్లా స్థాయిలో ఎంపికైన కళాకారులు రాష్ట్ర స్థాయిలో ఆ తరువాత జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకు రావాలని తెలిపారు. జిల్లా యంత్రాంగం కళాకారులను ఎల్లప్పుడు ప్రోత్సహిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడ శాఖ అధికారి అ శ్వక్ అహ్మద్, యువజన సంఘాల ప్రతినిధులు, కళాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి చర్యలు
ఆసిఫాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కాగజ్‌నగర్‌లో గల ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలో సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశంలో విద్యాశాఖ, ఇంజనీరింగ్, వైద్య, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు, గురుకుల ప్రిన్సిపాళ్లు, పేరెంట్స్ కమిటీ సభ్యులతో కాగజ్‌నగర్ పట్టణంలోని ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల పాఠశాలలో 455 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి భాస్కర్, ప్రిన్సిపాల్ కనకవర్మ, స్టూడెంట్ కౌన్సిలర్ ఇంద్రకుమార్, పేరెంట్స్ కమిటీ సభ్యులు సత్యనారాయణ, సునిత పాల్గొన్నారు.